Wed Sep 27 2023 14:22:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు అదే కలసి వచ్చేటట్లుందే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతానికి బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతానికి బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు. ఆయన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కమలం పార్టీతో కాలుదువ్వుతున్నారు. కయ్యానికి సిద్ధమవుతున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్ని రాష్ట్రాల బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలను కలుస్తున్న కేసీఆర్ పొరుగున ఉన్న ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు ఇష్టపడటం లేదు.
కేసీఆర్ కాలుదువ్వుతుండటంతో....
జగన్ ను కలిసినా ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని కేసీఆర్ భావించి ఉండవచ్చు. కానీ జగన్ కు మాత్రం అదే కావాలి. ఇప్పుడు బీజేపీకి దక్షిణ భారతదేశంలో జగన్ కంటే నమ్మకమైన నేత కన్పించడం లేదు. కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకి కూడా. వచ్చే ఎన్నికలలో ఏ మాత్రం తేడా కొట్టినా, మద్దతు కావాలంటే జగన్ అవసరమే బీజేపీకి ఉంటుంది. 2019 ఎన్నికల మాదిరిగా కేంద్రంలో బీజేపీ అంత పెద్ద స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేదు.
ఈసారి కష్టమే....
మ్యాజిక్ ఫిగర్ కు కూడా బీజేపీ చేరుకోవడం కష్టమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ బీజేపీపై యుద్ధం మొదలు పెట్టారు. అది కాంగ్రెస్ ను వీక్ చేయడానికన్న కామెంట్స్ వినపడుతున్నప్పటికీ, కేసీఆర్ కసితోనే కమలం పార్టీతో కయ్యానికి సిద్ధమయినట్లే కన్పిస్తుంది. ఆయన పై బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా నమ్మకం లేదు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమయినా బీజేపీకి భవిష్యత్ లో ఉపయోగపడరన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలకు అర్థమయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత....
అందుకే జగన్ అవసరం ఎప్పటికైనా ఉంటుందని బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే కోరిన వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ఎంత నీలిగినా, హస్తినలో మాత్రం జగన్ కు ఫేవర్ గానే బీజేపీ పెద్దలు ఉన్నారు. అయితే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీచిందంటే మాత్రం జగన్ పంట పండినట్లే. ఆయన ఒక్కడినైనా మంచి చేసుకునే ప్రయత్నం బీజేపీ పెద్దలు చేేస్తారన్నది రాజకీయ నిపుణుల అంచనా.
Next Story