ఆత్మకూరు సీటు అడిగిన ఆనం... జగన్ రిప్లై ఇదే

ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత ఆనం రామానారాయణరెడ్డి పార్టీ మారతారన్న వార్తలు గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోన్న ఆయన ఎట్టకేలకు జగన్‌ను కలవడంతో పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చింది. అయితే ఆయన పార్టీ మార్పు కోసం ఇప్పుడు రెండు అంశాలు కాస్త ఆలస్యమయ్యేలా చేస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఆషాఢ మాసంగా తెలుస్తోంది. తాజాగా ఆనం గురువారం హైదరాబాద్‌లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో ఆయన చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆషాఢమాసం కావడంతో ఆయన ఆషాఢం వెళ్లిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని పార్టీ మారనున్నారు. ఇదిలా ఉంటే ఆనం పోటీ చేసే సీటు విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీలోకి వచ్చాక 2019 ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయమై ఉభయుల మధ్య చర్చ జరిగింది. ఆనం ఆత్మకూరు సీటు ఇవ్వాలని అడగగా.. జగన్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఉన్నాడు కదన్నా అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆత్మకూరు ఇవ్వడం కష్టమవుతుందని... అక్కడ గౌతంరెడ్డిని తప్పించలేమని... అయితే మీకు అనుకూలమైన, పట్టున్న మరో నియోజకవర్గం ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక మనకు తెలిసిన సమాచారం ప్రకారం నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి అయినా పోటీ చేయాలని ఆనం చూస్తున్నా...ఆ రెండు సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నెల్లూరు సిటీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీథర్‌రెడ్డి ప్రాథినిత్యం వహిస్తున్నారు. వీరిద్దరు గత ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఇప్పుడు వారు అక్కడ స్ట్రాంగ్ పర్సన్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిని తప్పించి అక్కడ ఆనంను పోటీ చేయించినా అనేక సమీకరణలు మారతాయి. సిటీలో బీసీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌ను తప్పిస్తే బీసీల్లో పార్టీపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. పైగా అనిల్‌కు కేడర్‌లో మంచి పేరు ఉంది.
ఇక రూరల్‌లో కోటంరెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారు. అన్ని సమీకరణలను బట్టి చూస్తే వెంకటగిరి ఒక్కటే ఇప్పుడు ఆనంకు ఆప్షన్‌గా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు పట్టించుకోకపోవడంతో జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఇన్చార్జ్గా ఉన్నారు. జడ్పీచైర్మన్‌గా ఉన్న ఆయన ఇక్కడే తన నిధులను ఎక్కువుగా ఖర్చు చేస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు.ఇప్పుడు ఆనం పార్టీలో చేరడంతో రాఘవేందర్రెడ్డిని తప్పించి వెంకటగిరి నుంచి ఆనంను బరిలోకి దింపే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా టీడీపీలో అసంతృప్తితో ఆనం వైసీపీలో చేరుతున్నా అక్కడ కూడా ఆయనకు అనుకూలమైన నియోజకవర్గం అయితే దక్కే పరిస్థితి లేదు
