ఆనంకు మంత్రి పదవి.. రెండు టికెట్లు కూడా

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, మంత్రి నెల్లూరుకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే వైసీపీలోకి చేరబోతున్నారు. ఈ విషయం కొత్తకాదు. దాదాపు రెండు మూడు నెలల నుంచి ఈ వార్త మీడియాలోను, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. అయినా క్లారిటీ రాలేదు. అయితే, ఆయన వైసీపీ అధినేత జగన్‌తో తాజాగా హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సదర్భంగా ఓ క్లారిటీ వచ్చింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆనం సోదరులు.. తర్వాత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో వారికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. ఆయన స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరాలని వారిని కోరారు. అయితే, అప్పట్లో మౌనం వహించిన ఆనం సోదరులు.. ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉండిపోయారు.
ఆ తర్వాత అనూహ్యంగా వారు టీడీపీ బాట పట్టారు. చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో వారు ఇద్దరూ సైకిల్ ఎక్కారు. అప్పటి పరిస్థితిలో ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్సీపదవితోపాటు మంత్రి వర్గంలోనూ చోటు కల్పిస్తానని బాబు వారికి హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఆనం వివేక కూడా ఎమ్మెల్సీ ఆశించారు. అయితే, అది రెండేళ్లు గడిచినా వారికి నెరవేరలేదు. దీంతో వారు మౌనంగా ఉండిపోయారు. అడపాదడపా ఆనం వివేకానంద రెడ్డి అసహనం ప్రదర్శించినా.. రామనారాయణ రెడ్డి మాత్రం పెదవి విప్పలేదు. అయితే, రానురాను నెల్లూరు జిల్లాలో వారి పరిస్థితి దారుణంగా మారిపోవడం, టీడీపీలో ఆశించిన స్థాయిలో వారికి గుర్తింపు లేకపోవడం వంటి కారణాలు తీవ్రంగా వేధించాయి., ఈ నేపథ్యంలోనే ఆనం వివేకా .. ఇటీవల మృతి చెందారు. ఆయన కోరిక అయిన ఎమ్మెల్సీ అవ్వడం తీరకపోవడం కూడా ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆ ఫ్యామిలీ అభిమానుల్లోనూ తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది.
ఈ పరిణామం తర్వాత .. ఇక, పార్టీలో ఉండి తాను మాత్రం సాధించేది ఏమిటని రామనారాయణ రెడ్డి ఓ డెసిషన్‌కు వచ్చారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై సర్వత్రా వార్తలు వచ్చాయి. చివరకు పార్టీ మారినందుకు రామనారాయణరెడ్డికి చంద్రబాబు ఆత్మకూరు ఇన్చార్జ్ బాధ్యతలతో సరిపెట్టారు. అక్కడ కూడా ఆయనకు పార్టీ బాధ్యతలు ఇచ్చినా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ఆనంను కాదని అక్కడ గత ఎన్నికల్లో ఓడిన కన్నబాబును సపోర్ట్ చేస్తుండడంతో రామనారాయణరెడ్డి తీవ్రంగా రగిలిపోయారు. చివరకు ఆయన పార్టీ మారేందుకే రెడీ అయ్యారు. నిజానికి ఆనం సోదరుల రాకతో నెల్లూరులో పార్టీ పుంజుకుంటుందని, తనకు తిరుగులేకుండా ఉంటుందని చంద్రబాబు భావించారు. అయితే, స్థానికంగా ఉన్న మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ వంటివారు.. ఆనం సోదరులను ఎదగనివ్వలేదనేది మరో టాక్.
ఈ క్రమంలో చంద్రబాబు కూడా మౌనం వహించడం ఆనం ఫ్యామిలీని తీవ్రంగా కలచి వేసింది. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మార్పునకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఆయన వైసీపీలోకి వెళ్తారని కొందరు, కాదు, కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం ఉన్న నేపథ్యంలో మళ్లీ ఆయన కాంగ్రెస్‌లోకే వెళ్తారని కొందరు ప్రచారం చేశారు. మొత్తంగా ఆనం.. ఇప్పుడు వైసీపీలోకే వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీనిని పసిగట్టిన చంద్రబాబు.. మంత్రి గంటా శ్రీనివాసరావును రాయబారం పంపి.. పార్టీ మారకుండా చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే ఆనం.. వైసీపీలోని విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలతో మంతనాలు చేసి ఉండడంతో మనసు మార్చుకోలేక పోయారు.
తాజాగా వైసీపీ అధినేత జగన్‌తో రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే తనకు చంద్రబాబు ఇస్తానన్న పదవులు, హామీల విషయం కూడా చర్చకు వచ్చింది. వచ్చే ఏడాది లేదా ముందుగానే జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో తనకు రెండు టికెట్లు కావాలని, ఒకటి తనకు రెండోది తన అన్న కుమారుడు మయూర్‌కు కేటాయించాలని జగన్‌ను కోరారు. అదేవిధంగా పార్టీ ఎలూగూ అధికారంలోకి రావడం ఖాయం అని ఆనం భావిస్తోన్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక తనకు మంత్రి పదవిని కేటాయించాలని కూడా ఆనం కోరినట్టు తెలుస్తోంది. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
అయితే, నెల్లూరులో పార్టీని పూర్తిగా గెలిపించే బాధ్యతను తీసుకోవాలని, ముఖ్యంగా మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌కు చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని, రాబోయే రోజుల్లో పార్టీని మరింతగా బలపరచాలని జగన్ సూచించారని తెలుస్తోంది. దీనికి ఆనం ఓకే చెప్పారని సమాచారం. మొత్తంగా ఆనం.. రాబోయే జగన్ కేబినెట్లో బెర్త్ రిజర్వ్ చేసుకున్నారని ఆయన అనుచరులు ఆఫ్‌ది రికార్డుగా చెబుతుండడం గమనార్హం.
