Tue Jun 06 2023 13:39:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆనం టీడీపీలోకి వస్తే ఎవరికి లాభం?
ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు

ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదన్నది ఒక కారణమైతే తనకు వ్యతిరేకంగా వైసీపీలో కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే జిల్లాల విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరుకు మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని ఆనం రామనారాయణరెడ్డి కోరుతున్నప్పటికీ ఆయన డిమాండ్ వేరే ఉందంటున్నారు.
దగ్గరవుతున్నారని....
ఆనం రామనారాయణరెడ్డి టీడీపీికి మరోసారి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆనం తెలుగుదేశం పార్టీ నుంచే గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. 2014లో తాను పోటీ చేసిన ఆత్మకూరు నుంచి ఓడిపోయినా టీడీపీ అధికారంలోకి వచ్చినా తమ కుటుంబానికి చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆయన అసహనంతో బయటకు వచ్చారు. తనకు ఇష్టమైన ఆత్మకూరు నియోజకవర్గాన్ని వదిలేసి వెంకటగిరికి షిఫ్ట్ అయ్యారు.
వైసీపీలో ఉన్నా...
రాజకీయంగా రాజీపడి వైసీపీలోకి వచ్చినా తాను ఈ మూడేళ్లలో ఇబ్బందులు తప్ప మరేమీ చూడలేని ఆనం రామనారాయణరెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోసారి టీడీపీలోకి వస్తే తనకు ప్రయారిటీ దక్కుతుందా? అన్న అనుమానం ఆయనలో లేకపోలేదు. అయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్ప మరో బలమైన నేత అక్కడ లేరు. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే పార్టీకి లాభమే కాని, తనకు రాజకీయంగా కలసి వచ్చే అంశాలేంటి అన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు.
స్పష్టత వచ్చేంత వరకూ.....
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వరస ఓటములతో ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మరోసారి జిల్లాలో మంత్రి పదవి విషయంలో తనకు సోమిరెడ్డి ఇబ్బంది అవుతారని తెలుసు. జిల్లాలో మాత్రం తాను చెప్పినట్లు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి మరింత స్పష్టత వచ్చేంత వరకూ వెయిట్ చేయడం మంచిదని ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. ఇంకా రెండేళ్లు సమయం ఉండటంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.
Next Story