షా....ఫార్ములానే పక్కన పెట్టేశారే...!

బిజెపి జాతీయ రధసారధి అమిత్ షా తెలంగాణ బిజెపి పై గరం గరం అయ్యారు. కారణం పార్టీ ఇచ్చిన ఫార్ములాను తెలంగాణ బిజెపి శాఖ పాటించకపోవడం ఆయనకు చిర్రెత్తేలా చేసింది. దేశమంతా పార్టీ ఒక రూట్ లో వెళుతుంటే తెలంగాణ శాఖ దానికి భిన్నంగా వెళుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వారు తీరు మార్చుకోకపోవడంతో షా కి ఏమిచేయాలో అర్ధం కాక కొత్త డెడ్ లైన్ లోగా చెప్పింది చెయ్యండని ఆదేశించారు. ఇలా అయితే ఎన్నికలకు ఎలా వెళతామంటూ తెలంగాణ బిజెపి శాఖను మందలించారు.
షా ఇచ్చినా ఫార్ములా ఇదే ...
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ని బలోపేతం చేసేందుకు అమిత్ షా ఒక ఫార్ములా అమలు చేస్తూ అనేక విజయాలను అలవోకగా అందుకుంటున్నారు. ఆ ఫార్ములా ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ లో పదిమంది చొప్పున నియామకం అయ్యి ఉండాలి. బూత్ లో ఐదుగురు కి స్మార్ట్ ఫోన్లు ఉండాలి. మరో ఐదుగురు బైక్ ఏజెంట్ లు రెడీ గా ఉండాలి. ఈ పదిమంది సమన్వయంతో పనిచేసే సామర్ధ్యాన్ని శిక్షణ అందించాలి.
ఖచ్చితంగా అమలు చేయాలన్నా....
పార్టీ ఫార్ములా ప్రకారం 30 అంశాలు ఉంటాయి. అందులో 23 ఖచ్చితంగా అమలు చేయాలి. చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలోని బిజెపి శాఖ పనిచేయాలి. కానీ తెలంగాణ లోని అనేక నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో టి బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కి క్లాస్ పీకేశారంట షా. అంతేకాదు వచ్చే ఆగస్టు 15లోగా పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరి పార్టీ ఫార్ములాను ఇప్పటి వరకూ తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు పక్కన పెట్టారు? గ్రూపు విభేదాలే కారణమా? మరి ఇప్పటికైనా అమిత్ షా ఫార్ములాను తగాదాలను పక్కనపెట్టి పూర్తి చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
