ఎయిర్ ఏషియా కుంభకోణం..ఫోన్ ట్యాపింగ్ కలకలం..?

ఫోన్ ట్యాపింగ్... గత నాలుగేళ్ల కింద ఓటుకు నోట కేసులతో పాటు బాగా వినిపించన మాట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఓటుకు నోటు కేసులో ఆరోపణలు రాగా, చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. అయితే, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ రెండు కేసులూ అటకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు రావడంతో ఇప్పుడు బీజేపీపై టీడీపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు.
ఏమిటీ ఎయిర్ ఏషియా కుంభకోణం...
ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు నడపాలంటే.. దేశంలో డొమెస్టిక్ సర్వీసులు నడిపిన ఐదేళ్ల అనుభవం, 20 ఫ్లైట్లు కలిగి ఉండాలనేది నిబంధన. అయితే, మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ కేవలం 20 ఫ్లైట్లు ఉంటే చాలు, ఐదేళ్ల అనుభవం అవసరం లేదు అని నిబంధనను తమకు అనుకూలంగా మార్పించుకుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోకగజపతి రాజు ఉన్నప్పుడే ఈ నిబంధన మార్పు జరిగిందని, ఇందుకోసం ఆ సంస్థ అడ్డదారుల్లో వెళ్లిందనేది ఆరోపణ. ఎయిర్ ఎషియా కుంభకోణంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండేజ్, ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈ విషయాన్ని బిజినెస్ టుడే ప్రచురించింది. ‘మనకు ఎలాగైనా కొన్ని రూట్ల ఇంటర్నేషనల్ పర్మీషన్లు కావాలని, అడ్డదారిలో వెళ్లైనా పర్మిట్లు సాధించాలి’ అని టోనీ ఫెర్నాండేజ్ మిట్టూ శాండిల్యతో అన్నాడు. దీనికి ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పట్టుకుంటే పని అవుతుంది, ఆయన మనిషే ఇప్పుడే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు’ అని మిట్టూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఏపీ టీడీపీలో ఒకింత కలకలం రేగింది. బీజేపీపై ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.
మీకెందుకు భయం అంటున్న జీవీఎల్...
టీడీపీ నేతల ఆరోపణలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఎయిర్ ఏషియాపై విచారణ జరుగుతోందని, విచారణ జరిపే క్రమంలో ఎవరిపైనైనా నిఘా వేయవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎవరో మాట్లాడుకున్నవి బయటకు వస్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అయినా, ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఆ నీచ సంస్కృతి టీడీపీ దేనని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాప్ చేస్తోందని టీడీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. త్వరలోను ఎయిర్ ఏషియా కుంబకోణంలో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. అయితే, ఈ కుంభకోణం బూచీగా చూపి బీజేపీ తమను ఇబ్బంది పెడుతుదేమోనని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళణ చెందుతున్నారు.

