‘అమ్మ రేంజికి చంద్రబాబు : హోరెత్తిన పాదనమస్కారాలు

తమిళనాడు రాజకీయాలు గమనించినప్పుడు ఇతర ప్రాంతాల ప్రజలకు ఒక లక్షణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఫరెగ్జాంపుల్ జయలలిత విషయాన్నే తీసుకుంటే.. ఆమె పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు జనం పదేపదే ఆమె పాదాలమీదపడి మొక్కుతూ ఉంటారు. ప్రజలే కాదు.. మంత్రులు అధికారులు సైతం అమ్మ పురట్చితలైవి పాదాల మీద పడి మొక్కుతూ ఉండడం సాధారణంగా కనిపిస్తుంది. బాబాలు స్వామీజీల కంటె ఎక్కువన్నట్లుగా ఇలాంటి పాదనమస్కారాలు మనకు దర్వనమిస్తాయి.
చూడబోతే ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే రేంజికి చేరిపోయినట్లుగా కనిపిస్తోంది. అమరావతిలో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబునాయుడుకు నాయకులు మంత్రులు ఉద్యోగులు పదేపదే కాళ్లు మొక్కడం చిత్రంగా కనిపించింది.
వెలగపూడి సెక్రటేరియేట్ 5వ బ్లాక్ లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం 8.09 గంటలకు నిర్ణయించిన ముహూర్తానికి ప్రారంభించారు. పూజాదికాలు నిర్వహించిచన తర్వాత.. సుఖాసీనులు అయి కొలువు తీరిన చంద్రబాబునాయుడుకు వచ్చిన అతిథులు అందరూ బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా... పలువురు చంద్రబాబు కాళ్ల మీద పడి మొక్కి నమస్కారాలు చేయడం విస్మయం కలిగించే విషయం. పార్టీ మరియు ప్రభుత్వం అధినేత గనుక ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి పాట్లు వారు పడతారని అనుకోవచ్చు.. కానీ చంద్రబాబు కూడా ఇలాంటి పాదనమస్కారాల్ని వారించే ప్రయత్నం చేయకుండా ఎంచక్కా వాటిని ఎంజాయ్ చేశారు.
తెలుగునాట కూడా తమిళ సంస్కృతి వచ్చేసిందని.. అధినేతలకు పాదనమస్కారాల వెల్లువ ముంచేస్తున్నదని జనం అనుకుంటున్నారు. ఇలా పాదనమస్కారాలు చేసిన వారిలో మంత్రులు రావెల కిశోర్ బాబు లాంటి వారినుంచి ఎమ్మెల్యే బోండాం ఉమా, ఇతర నాయకులు, అమరావతి ప్రాంత రైతులు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉండడం విశేషం.

