5వేల ఎకరాల్లోనే కట్టేస్తానంటున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్మోహన రెడ్డి మరో యాత్రకు ఉపక్రమించారు. గురువారం నాడు ఆయన బందరు పోర్టు కు భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులను కలిశారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను ప్రతిఘటిస్తున్న ప్రాంతాల్లో ఒక్కటొక్కటిగా పర్యటిస్తూ.. అక్కడ పోరాటాలు చేస్తున్న వారికి తన మద్దతును తెలియజేస్తూ.. తన తరఫున భరోసా అందిస్తూ వస్తున్న విపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి బందరు పోర్టుకు అవసరాన్ని మించి భూసేకరణ చేస్తున్నారంటూ వ్యతిరేకిస్తున్న వారికి మద్దతుగా నిలబడే ప్రయత్నం చేశారు.
సహజంగానే జగన్ ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు సర్కారు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు.. పేదలనుంచి భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడానికి చూస్తున్నారని ఈ వ్యవహారాల వెనుక భారీ ఎత్తున అవినీతని జరుగుతున్నదని ఆరోపణలు గుప్పించారు.
అలాగే. బందరు పోర్టు కోసం 30 వేల ఎకరాలను సేకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను జగన్ తీవ్రంగా తప్పు బట్టారు. ఒకప్పట్లో ప్రభుత్వం నాలుగు వేల ఎకరాలు కావాలని అంటే.. అంత స్థలం ఎందుకు బందరు పోర్టును 1800 ఎకరాల్లోనే నిర్మించవచ్చునని అన్న చంద్రబాబు... ఇవాళ 30 వేల ఎకరాల మీద కన్నేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పట్లో ఇదంతా పూర్తయ్యే వ్యవహారం కానే కాదని.. రెండేళ్ల తర్వాత అయినా ఎటూ తమ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది గనుక.. రైతుల కన్నీళ్లకు ఆస్కారం లేకుడా.. కేవలం 5 వేల ఎకరాల్లోనే తాము మంచి పోర్టును ఏర్పాటుచేస్తాం అని జగన్ ప్రకటించారు.

