2019లో తెలంగాణ అధికారం ఊడ్చేస్తారంట!

‘‘రాబోయే రెండేళ్లలో మా పార్టీని బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తాం’’ ఈ మాటలు అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన సోమ్నాధ్ భారతి అంటున్నారు. వరంగల్ లో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మాదిరిగానే అనూహ్యమైన ప్రజాస్పందనతో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆప్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వరంగల్ లో కార్యాలయం ఏర్పాటు అయింది. నిజానికి పార్టీకి తెలంగాణ కో కన్వీనర్ గా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సారథ్యంలో.. కార్యవర్గం మాత్రం ఉంది. ఆ పార్టీ ఇప్పటిదాకా చేపట్టిన నిర్దిష్టమైన ప్రజా కార్యక్రమాలేమీ లేవు. అయితే గత ఎన్నికల సమయంలో కూడా ఆప్ ఇక్కడ తమ అస్తిత్వం చాటుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో కొందరు సామాన్యులకు టికెట్లు ఇచ్చి వారిని బరిలో దించింది. ఆటోవాలా లాంటి సామాన్యులకు టికెట్లు ఇచ్చిందనే క్రెడిట్ మిగిలింది తప్ప.. ఓట్ల పరంగా సాధించింది శూన్యం. రోహిత్ ఆత్మహత్య సమయంలో హైదరాబాదు రావడం మినహా కేజ్రీవాల్ తెలంగాణలో తమ పార్టీ వేళ్లూనుకోవడం గురించి ఏమాత్రమూ ప్రయత్నించింది కూడా లేదు. నిజానికి ఢిల్లీ పీఠం దక్కించుకున్న సమయంలో వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ ను కాపాడుకోవడానికి అప్పట్లోనే ఈ రాష్ట్రంమీద కూడా దృష్టిపెట్టి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది.
తాజా పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీని కాదని పెద్ద పార్టీలే మనుగడ సాగించ లేకపోతున్నాయి. కాకపోతే.. అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం, భాజపా అన్నీ కూడా 2019 ఎన్నికల్లో అధికారం మాత్రమే తమదేననే పాటపాడుతున్నాయి. ఇప్పుడే వచ్చి ఆఫీసు తెరచిన ఆప్ కూడా అదే పాట పాడడం చిత్రంగా ఉన్నదని జనం అనుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల అవసరాల గురించి నిర్దిష్టమైన పోరాట ప్రణాళిక కూడా లేకుండా.. కేవలం ఆఫీసు పెట్టడం ద్వారా కార్యవర్గం పేరుతో కొందరికి పదవులు కల్పించడం ద్వారా తాము కూడా అధికారం గురించి మాట్లాడేస్తే ఎలా? అంటున్నారు.

