1000 కోట్లు దాటిన కోడి పందాలు ...ఖాకీలు చేతులెత్తేశారా ...?

పందెం రాయుళ్ళే పైచెయ్యి సాధించారు. కోడి పందాలను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అంటూ ...కత్తులు కట్టకుండా అనే చిన్న లా పాయింట్ తో మొత్తం షో మొదలు పెట్టేశారు. గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున పందేలు నడుస్తుంటే రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో కోడికి కత్తి కట్టి కోట్లు సంపాదించేస్తున్నారు. ప్రస్తుతం ఈ పందాల దందా వెయ్యికోట్ల రూపాయలకు పైమాటగానే వినిపిస్తుంది. అత్యధిక సొమ్ము గోదావరి జిల్లాలో చేతులు మారుతుంటే మిగిలిన జిల్లాలు పోటీలు పడుతున్నాయి. ఇక పోలీసులు పైకి హడావిడి చేస్తున్నా రాజకీయ వత్తిడులు కారణంగా బడా బాబుల జోలికి పోకుండా చిన్నా చితకా పందాలు ఆడుకునే వారిపై పడి కేసులు పెట్టి లోపలేస్తున్నారు.
ఫ్లడ్ లైట్లు, ఎల్ ఈ డి స్క్రీన్లు, నాన్ స్టాప్ మద్యం...
ఒక భారీ టి ట్వంటీ క్రికెట్ పోటీలకు జరిగే హంగామా ఇప్పుడు కోడిపందాలు సాగుతున్న ప్రాంతాల్లో నడుస్తుంది. నిరంతరాయంగా పందాలు నడిచే విధంగా మినీ స్టేడియం లు ఫ్లడ్ లైట్లు, ఎల్ ఈ డి స్క్రీన్లు, నాన్ స్టాప్ మద్యం సరఫరా, గుండాటలు ఇలా ఒకటేమిటి సర్వం సంప్రదాయాల ముసుగులో సాగిపోతున్నాయి. ఓట్ల కోసం నోట్ల కోసం స్థానిక ప్రజా ప్రతినిధులే దగ్గరుండి ఈ దందా నడిపిస్తున్నారు. తుని, కాకినాడ రూరల్, కోనసీమలోని మురమళ్ళ, పాలకొల్లు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో పందెం రాయుళ్ళకు పగ్గాలు వేసే దమ్ము ఎవరికీ లేదు. పోలీస్ రెవెన్యూ యంత్రాంగాలకు సమాచారం వున్నా అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయడం లేదు.
- Tags
- కోడి పందాలు

