మారుతున్న రాజకీయం : తమిళనాడుకు కొత్త సీఎం?

తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి జయలలితను పరామర్శించ వెళ్లడం ఒక కీలక పరిణామం అయితే సాయంత్రానికి ఇంచార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా మదరాసు చేరుకున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు కొత్త సీఎం తాత్కాలికంగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.
జయలలిత మరికొన్ని రోజుల పాటు అనివార్యంగా చికిత్స తీసుకుంటూ బెడ్ మీద ఉండాల్సిందేనన్న సంగతి ధ్రువపడడంతో.. పరిపాలన పరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పార్టీలోని మరో సీనియర్ నాయకుడు పళని స్వామి ఇద్దరూ శుక్రవారం సాయంత్రం మదరాసులోని రాజ్ భవన్ లో ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును కలుసుకున్నారు.
ఈ ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. జయలలిత సహచరి శశికళ, ఆమెకు అత్యంత సన్నిహితురాలైన మరో రిటైర్డు ఐఏఎస్ అధికారిణి షీలా బాలక్రిష్ణన్ లు కూడా సీఎం అయ్యేందుకు చక్రం తిప్పుతున్నట్లుగా కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే శుక్రవారం సాయంత్రం గవర్నర్ వద్దకు పన్నీర్ సెల్వం, పళనిస్వామి వెళ్లడంతో సినేరియో మారుతోంది. వీరిద్దరిలో ఒకరిని ఇంటర్మ్ సీఎం గా ప్రకటిస్తూ కాసేపట్లో రాజ్ భవన్ నుంచి ప్రకటన రావచ్చునని కూడా అనుకుంటున్నారు. వీరిద్దరు రాజ్ భవన్ కు వెళ్లడానికి ముందు.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామ్మోహనరావు కూడా వెళ్లి గవర్నరును కలిశారు.
చెన్నై రానున్న మోడీ
కాగా, ప్రధాని నరేంద్రమోడీ జయలలితను పరామర్శించేందుకు శనివారం మదరాసు రానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శుక్రవారం రాహుల్ వచ్చారు. శనివారం ప్రధాని వస్తున్నారని సమాచారం.

