హోదా ఉద్యమం తాటాకు చప్పుళ్లేనా?

ప్రత్యేక హోదా సాధించలేకపోవడానికి కారణాలేంటి? ఉద్యమాలను చల్లార్చడంలో ఎవరి పాత్ర ఎంత? రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆందోళన బాట పట్టింది. విద్యార్థి జేఏసీ మాత్రమే కాదు సమైక్యాంధ్ర జేఏసీ పేరిట అన్ని పార్టీలూ కలిసి రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని ఆందోళనలు చేశాయి. దాదాపు ఆరునెలల పాటు ఉద్యమాలు కొనసాగించారు. రాస్తారోకోలు, బంద్ లతో ఏపీలో ఆ ఆరు నెలలు హడావిడి కన్పించింది. అయితే రాష్ట్ర విభజన జరిగి పోయింది. ఎన్నికలూ జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
జేఏసీ ఎక్కడ?
అయితే ఈ నాలుగేళ్ల కాలంలో ఏపీలో జేఏసీ అనే మాట విన్పించకుండా పోయింది. విద్యార్థి జేఏసీ అనేది ఉందా? లేదా? అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. విభజన జరిగిన తర్వాత అధికార పార్టీ నేతలు ఆందోళనల వల్ల రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుందని పదే పదే చెబుతూ వచ్చారు. జేఏసీ నేతలకు కూడా అధికార పార్టీ గాలం వేసిందన్న విమర్శలూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు దాదాపుగా ఏపీలో కనుమరుగై పోయాయి. ఉద్యోగ సంఘాలయితే రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని బీరాలు పలికి సమ్మెకు దిగారు. కాని ఇప్పుడు తమ డిమాండ్ల కోసమే వారు ఉద్యమిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ఊసేదీ?
గత పదిహేను రోజులుగా ఏపీలో ప్రత్యేక హోదా నినాదం ఊపందుకుంది. అన్ని పార్టీలూ ప్రత్యేకహోదా కావాలంటున్నాయి. చివరకు ప్యాకేజీకి అంగీకరించిన అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాడాల్సిన విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. దీనికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవడం వల్ల ఉద్యోగసంఘాల నేతలు ఆందోళనలు చేద్దామన్న ఉద్యోగులు పెద్దగా సుముఖత చూపడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల ఊసే ఇందులో లేకుండా పోయిందంటున్నారు.
ఐక్యంగా కలిస్తేనే కదా?
ఇక విద్యార్థి జేఏసీ పరిస్థితి కూడా అంతే. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో టీవీల్లో, పత్రికల్లో ప్రగల్భాలు పలికిన విద్యార్థి జేఏసీ నేతలు అధికార పార్టీ అండతో సెటిల్ అయిపోయారన్నది టాక్. గతంలో ఒకసారి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు జల్లికట్టు తరహాలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సాగరతీరాన దీక్ష చేయాలని తలచినా ప్రభుత్వం దాన్ని అణిచివేసింది. విద్యార్థులపై కేసులు నమోదు చేసింది. దీంతో కొన్ని సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నా వారిని ప్రోత్సహించే వారు కరువయ్యారన్న విమర్శ కూడా ఉంది. అందరూ ఏకమైతే తప్ప అనుకున్నది సాధించలేమని తెలిసినా ఐక్య ఉద్యమానికి మాత్రం సిద్ధం కావడం లేదు. ఎవరి దారి వారిదే. ఎవరి కార్యాచరణ వారిదే. ఇలా అయితే ఎలా అన్న ఆందోళన ఏపీ ప్రజల్లో నెలకొని ఉంది.

