హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేనా?

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్ కు వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు విశ్వనగరానికి చేరుకున్నారు. నీతి ఆయోగ్, టీ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుతో హైదరాబాద్ కు ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశముంటుంది. ఈ సదస్సును పెట్టుబడుల కోసం నిర్వహించడం లేదని ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించారు. పెట్టుబడులు ఏవీ రాకున్నా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం, యువ పారిశ్రామిక వేత్తలకు మాత్రం ఈ సదస్సు ప్రోత్సాహకరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సదస్సుకు 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ఇది మంచి అవకాశమని చెబుతున్నారు. హైదరాబాద్ వేదికగా ఎంపిక కావడమే తొలి విజయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా ఇవాంకా....
మరోవైపు ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా హాజరవుతుండటం విశేషం. ఇవాంకా తెల్లవారు ఝామున 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కుచేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వెస్టిన్ హోటల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. సాయంత్రం 4.25 గంటల వరకూ ప్రధాని మోడీతో కలిసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్పులో పాల్గొంటారు. రెండో రోజు సదస్సులో హీరో రామ్ చరణ్ కూడా ప్రసంగించనున్నారు. ఫ్యూచర్ ఆఫ్ సినిమా పై ఆయన ప్రసంగిస్తారు. రామ్ చరణ్ తో పాటు పుల్లెల గోపీచంద్ వంటి వారు కూడా ప్రసంగించనున్నారు. ఈ సదస్సు పెట్టుబడులకోసం కాకపోయినా ఆలోచనలను పంచుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యే సదస్సులో అనేక ఆలోచనలు ముఖ్యంగా స్టార్టప్ లకు ఉపయోగ పడతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సదస్సు కోసం హై సెక్యురిటీని ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పో్లీసు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- Tags
- హైదరాబాద్

