హైదరాబాద్‌లో మల్కన్‌గిరి ప్రకంపనాలు

పేరుకు తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయామే తప్ప... చాలా అంశాల పరంగా.. ఈ రెండు రాష్ట్రాల వ్యవహారాలు, జీవితాలు, పోరాటాలు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడే ఉన్నాయని తాజా దృష్టాంతం కూడా నిరూపిస్తోంది. ఒదిశాలో ఏపీ పోలీసులు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తే దాని తాలూకు ప్రకంపనాలు ఏపీలో కంటె ఎక్కువగా తెలంగాణలోనే.. అంటే హైదరాబాద్ లోనే కనిపిస్తున్నాయి. మావోయిస్టు సానుభూతి పరులైన ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో ఇప్పటికీ హైదరాబాదులోనే స్థిరపడి ఉండడం అనేది ఇక్కడి ఆందోళనలకు కారణం అవుతోంది.
ఒదిశాలో జరిగిన ఎన్కౌంటర్ ను ఏపీలో పోలీసులు చేశారు కాబట్టి... ఏపీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలనే డిమాండ్ వరకు సబబే. కానీ.. హైదరాబాదులోని మావోయిస్టు సానుభూతి పరులకు, ఉద్యమకారులకు మాత్రం.. ప్రభుత్వం ఉన్న విజయవాడ వరకు వెళ్లి.. అక్కడ ఆందోళనలు చేయడానికి వ్యవధిలేకపోవడం విశేషం. ఏపీలో పాలన సాగిస్తున్నది తెలుగుదేశం పార్టీ గనుక.. హైదరాబాదులోనే ఆ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగారు. తెలంగాణ తెలుగుదేశం కార్యాలయం ఎదుట , మావోయిస్టు కుటుంబసభ్యులు, సానుభూతి పరులు, విప్లవకవి వరవరరావు తదితరులు గురువారం రాత్రి ఆందోళనకు, ధర్నాకు దిగడం జరిగింది.
ఇది ఎన్ కౌంటర్ కాదని, మావోయిస్టులకు విషమిచ్చి చంపారని ఒకవైపు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పోలీసు కాల్పులకు నిరసనగా జరిగిన ఆందోళనలో వరవరరావు సహా అందరూ రోడ్డుమీద బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కారులు తెలంగాణ తెదేపా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఏవోబీ ఎన్ కౌంటర్ బూటకం అంటూ వీరు తెలంగాణ పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకుని తమ నిరసనలు తెలియజేశారు.

