హైదరాబాదీల కల నెరవేరబోతోన్న వేళ...!

హైదరాబాదీల కల నెరవేరబోతోంది. చిరకాల వాంఛ ఈడేరబోతోంది. గత ఆరేళ్లుగా ఊరిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రో రైలుకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపబోతున్నారు. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్... అది ఒక నరకం. ఈ నరకం నుంచి బయట పడేసేందుకే మెట్రో రైలు ఆలోచన. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే కాకుండా, కాలుష్యాన్ని నివారించేందుకు కూడా మెట్రో చక్కగా ఉపయోగపడుతుంది. మెట్రో స్మార్ట్ కార్డులు కొనేందుకు జనం ఎగబడుతున్నారంటే ఆ రైలు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. 2010వ సంవత్సరంలో మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైలు నిర్మాణ బాధ్యతను చేపట్టింది.
కాలుష్యం లేకుండా...ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా...
అప్పట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో మొత్తం 72కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలి. అయితే భూసేకరణ సమస్యలు రావడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో తెలంగాణ సర్కార్ మరో ఒకటిన్నర సంవత్సరం పొడిగించారు. 2018 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 57 రైళ్లు వివిధ మార్గాల్లో నడిచే విధంగా ప్రణాళికను రూపొందిచారు. ఛార్జీలను కూడా ఖరారు చేశారు. మెట్రో ఛార్జీలపై నగర ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో మెట్రో అధికారులు స్మార్ట్ బైక్స్ ను కూడా అద్దెకిచ్చే విధంగా ప్లాన్ చేశారు. స్మార్ట్ సైకిల్ కు అరగంటకు కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. అలాగే ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, వారం రోజుల సీజన్ టిక్కెట్లు కూడా ఇవ్వనున్నారు. ఈరోజు ప్రధాని మోడీ చేతుల మీదుగా మెట్రో రైలు పరుగులు తీస్తుంది. ఈ నెల 29వ తేదీ నుంచి మెట్రో రైలు హైదరాబాదీలకు అందుబాటులోకి వస్తుంది. మెట్రో రైలు ఏర్పడటంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు కూడా రెక్కలు రావడం విశేషం. మొత్తం మీద హైదరాబాదీల కలలు నేడు నెరవేరనున్నాయి.
- Tags
- మెట్రో

