హస్తంతో మిలాఖత్ కు సైకిల్ సంకేతాలు!

ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కాదు. ప్రస్తుతం ఎన్నికల నగరా మోగడానికి సిద్ధం అవుతున్న ఉత్తర ప్రదేశ్ లోని పరిస్థితి. కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేక ఓటు అనేది చీలిపోకుండా.. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహం మాదిరిగానే యూపీలో కూడా మహాకూటమి అంటూ ఏర్పాటు కాబోతున్నది. భాజపాయేతర పక్షాలన్నీ దాదాపుగా ఏకం కాబోతున్నాయి. తొలుత కాస్త భిన్నంగా స్పందించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీతో కలిసి బరిలోకి దిగడానికి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అంగీకరించడమే దీనికి సంకేతంగా భావించాలి.
యూపీలో మహాకూటమి ఏర్పాటుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని రోజులుగా యూపీలో తిష్టవేసి ఇదే పని మీద ఉన్నారు. ఆయన గతంలోనే సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లతో విడివిడిగా భేటీ అయ్యారు కూడా. అయితే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాల వెనుక అమర్ సింగ్ ఉండి నడిపిస్తున్నాడనే అనుమానంతో అఖిలేష్ వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే రోజులు గడిచే కొద్దీ, భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఐక్యంగా ఉండడంలో లాభం వారికి తెలిసివచ్చినట్లుంది. అందుకే కాంగ్రెస్ తో జట్టుగా రంగంలోకి దిగడానికి అఖిలేష్ ఓకే అంటున్నాడు. అయితే మాయావతితో కలవడానికి మాత్రం ససేమిరా అంటున్నాడు. కాకపోతే యూపీలో సైకిల్ పార్టీ సమాజ్ వాదీతో కలిసి బరిలోకి దిగడానికి కాంగ్రెస్ సిద్ధపడడం అంటే వారు కొన్ని సీట్లను తగ్గించుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు బీహార్ తరహాలో కూటమిలో ఉండొచ్చు గానీ.. వారు తలచినన్ని సీట్లు వారికి దక్కకపోవచ్చు. తద్వారా అధికారంలోకి వచ్చే స్థాయిలేని పార్టీగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కు పెద్దగా వేరే గత్యంతరం కూడా లేదు.
ఈ మహా కూటమి ఇంకా పొత్తులు తేల్చుకునే దశలో ఉండగా.. భాజపా ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించేసి దూసుకువెళుతోంది. మోదీ సర్కారు మీద ప్రజల్లో నోటు దెబ్బ ప్రభావం ఏ రీతిగా పడుతున్నదో రాబోయే ఎన్నికలు ఓ లిట్మస్ టెస్టులా తెలియజెబుతాయనే వాదన కూడా వినిపిస్తోంది.

