హరీష్ పై పేలుతున్న సెటైర్లు

టి మంత్రి హరీష్ రావు పై నెటిజెన్స్ గట్టిగానే సెటైర్లు పేలుస్తున్నారు. శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ తగిలి స్వామి గౌడ్ కంటికి గాయం కావడం తెలిసిందే. ఈ సంఘటనను ఖండిస్తూ మంత్రి హరీష్ రావు లీడ్ తీసుకుని మీడియా సమావేశం నిర్వహించి కాంగేయులపై తీవ్ర స్థాయిలో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇక్కడి దాకా బానే వుంది. ఈ వ్యవహారంపై హరీష్ స్పందించడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి స్పందించిన తీరును నెటిజెన్లు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సెటైర్లు విసురుతున్నారు.
ఉద్యమ సమయంలో టీఆరెస్ దాడులు ...
తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి మంత్రి హరీష్ రావు దూకుడుగా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. అటు మాటల్లో ఇటు చేతల్లో హరీష్ చూపిన స్పీడ్ ఏ నేత చూపలేకపోయారన్నది నిర్వివాదాంశం. హరీష్ నాటి రోజుల్లో గవర్నర్ ను కొట్టినంత పనిచేశారన్న వీడియో లను, అలాగే ఏపీ భవన్ సిబ్బందిని చితకొట్టిన వీడియో లు నెటిజెన్లు బయటకు తీశారు. ఆ వీడియో లను ప్రస్తుతం అసెంబ్లీలో జరిగిన దాడిని మిక్స్ చేసి మీరా నీతులు చెప్పేది అని ఉతికేస్తున్నారు. ఒక్క హరీష్ నే కాదు తెలంగాణ ఉద్యమ వేడిలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కూడా చెంపదెబ్బ తినాలిసి వచ్చింది. ఆ సంఘటన కూడా నాడు సంచలనమే అయ్యింది. ఇప్పడు అవన్నీ కాంగ్రెస్ నేతలకు బలం చేకూరుస్తున్నాయి. మీ సంగతి ఇదిగో అంటూ సోషల్ మీడియా వేదికలపై గత టీఆర్ఎస్ దాడులు విధ్వంసాలు ఇప్పుడు ఆ పార్టీకే తలనొప్పి తెచ్చి పెట్టాయి. హరీష్ రావు కొండా సురేఖ వంటివారు కాకుండా స్వేఛ్ఛమైన వారితో కౌంటర్ ఇచ్చి ఉంటే గులాబీ పార్టీకి కొన్ని మార్కులు పడేవి. ఇప్పుడు వున్న మార్కులు కూడా తగ్గిపోయే లా ఉందని ఆ పార్టీ వారే మధన పడుతున్నారు. మరి చరిత్ర చెరిపితే చెరిగిపోదు కదా..
- Tags
- హరీశ్ రావు
