హనీ ల్యాప్ టాప్ లో ఏముంది?

డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ ల్యాప్ ట్యాప్ లో వాస్తవాలు బయటపడతాయా? పోలీసు అధికారులు చూపిన సాక్ష్యాలను చూసి హనీప్రీత్ కూడా ఇది చూసి కళ్లు తేలేశారు. డేరాబాబా అరెస్ట్ జరిగిన తర్వాత అల్లర్లకు సంబంధించి హనీప్రీత్ ప్రధాన కారణమని పోలీసులు భావించారు. ఈకేసులో హనీప్రీత్ ను ఏ1 నిందితురాలిగా తేల్చారు. అయితే న్యాయస్థానంలో తాను అమాయకురాలినని, తనకు ఏ పాపం తెలియదని హనీ కన్నీరు మున్నీరయ్యారు. అయితే పోలీసుల విచారణలో హనీప్రీత్ నిజం అంగీకరించక తప్పలేదు. అల్లర్లకు కారణమెవరో ఆడియో, వీడియోలు మరీ అధికారులు హనీప్రీత్ కు చూపించడంతో ఆమె అవాక్కయ్యారు. దీంతో అల్లర్లకు స్కెచ్ గీసింది తానేనని అంగీకరించారు. డేరా బాబా అరెస్ట్ తర్వాత హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లో పెద్దయెత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. డేరాబాబా అనుచరులు సృష్టించిన విధ్వంసానికి దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందునుంచే ఈ అలర్ల వెనక హనీప్రీత్ హస్తం ఉందని హర్యానా పోలీసులు చెబుతూ వస్తున్నారు.
విచారణలో అంగీకరించిన హనీప్రీత్.....
అయితే పోలీసుల విచారణలో తొలుత హనీప్రీత్ ఈ అలర్లకు తనకు సంబంధం లేదని తెగేసి చెప్పారు. అయితే సాక్ష్యాధారాలను చూపడంతో హనీప్రీత్ అంగీకరించక తప్పలేదు. డేరా బాబా కేసు తీర్పుకు ముందు రోజు సచ్ఛా సౌధాలో బాబా కీలక అనుచరులతో హనీప్రీత్ సమావేశమయ్యారు. డేరా బాబాకు శిక్షపడి అరెస్ట్ చేస్తే ఏం చేయాలని ఈ సమావేశంలో చర్చించారు. బాబాను అరెస్ట్ చేస్తే పెద్దయెత్తున్న హింస చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అనేకచోట్ల బాబా అనుచరులను నియమించాలని స్కెచ్ వేశారు. వారికి అవసరమైన డబ్బులు కూడా అందరికీ పంచారు. ఎవరెవరికి ఎంత ఇచ్చిందీ హనీప్రీత్ తన ల్యాప్ ట్యాప్ లో నోట్ చేసుకున్నారు. అయితే ఆ ల్యాప్ ట్యాప్ పోలీసులకు దొరకలేదు. అల్లర్లకు కారణమైన వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారు చెప్పిన వివరాలను ఆడియో, వీడియో రికార్డ్ చేసి హనీప్రీత్ కు పోలీసులు చూపించారు. దీంతో ఆమె అవాక్కయ్యారు. హనీప్రీత్ ల్యాప్ ట్యాప్ లభిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. రాజద్రోహం కింద అరెస్ట్ చేసిన డేరా బాబా అనుచరులు చెప్పిన దానికి హనీప్రీత్ ఎట్టకేలకు అంగీకరించక తప్పలేదు. హనీప్రీత్ ల్యాప్ టాప్ కోసం పోలీసులు శోధిస్తున్నారు.
- Tags
- హనీప్రీత్

