‘‘స్టేటస్’’ పై తేల్చేసిన జైట్లీ

ప్రత్యేకహోదా ఉంటే ఏంజరుగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ఆయన ఏపీ విభజన హామీల విషయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలుంటాయన్నారు. హోదా ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయన్నది అందరూ ఆలోచించాలన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఆనవాయితీగా ప్రత్యేక హోదా ఇస్తున్న విషయం నిజమేనన్నారు. 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలుకాదన్నారు.తగినన్ని నిధులు లేకపోవడం వల్లనే ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇచ్చామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రత్యేక హోదా ఉంటే 90 శాతం నిధులు కేంద్రం భరిస్తుందని, పదిశాతం రాష్ట్రం భరిస్తుందని చెప్పారు. ఏపీ విభజన వల్ల వనరులను కోల్పోయిందన్నారు. ఏపీకి ఇష్టం లేకుండా విభజన జరిగిందన్నారు. ప్రత్యేక హోదాలాగానే ఐదేళ్ల పాటు ఏపీకి కేంద్రం 90 శాతం నిధులను ఇస్తుందన్నారు. అలాగే నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించాకే ప్యాకేజీని ప్రకటించామన్నారు. కొన్ని రోజుల పాటు రెవెన్యూలోటును భర్తీ చేస్తామని చెప్పారు. విదేశీ సంస్థలు ఇచ్చే రుణంలో కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా అనే మాట వాడకుండా ఏపీకి అన్నిరకాలుగా సాయం చేస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు. ఆంధ్ర విభజనతో నష్టపోయిందని తనకు తెలుసని, అందుకోసమే ఏపీని ఆదుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామనిచెప్పారు. విభజన చట్టంలో ఉన్న హమీలను నెరవేరుస్తమని, ఒక్క ప్రత్యేక హోదా మాత్రం సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో అన్నిరకాలుగా నిధులను ఏపీకి ఇస్తామన్నారు. పన్ను ప్రోత్సాహకాలన్నీ తొలి రెండు బడ్జెట్లో ఇచ్చేశామని జైట్లీ చెప్పారు.
- Tags
- అరుణ్ జైట్లీ
