సోషల్‌ట్రేడ్ ప్రకంపనలు

ప్రధానికి ఆన్ లైన్లో 4,500 మంది ఫిర్యాదు
హైదరాబాద్ లో వేలల్లో బాధితులు
రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు .....
డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసపోయామంటూ ఒక సాఫ్ట్వేర్ సంస్థలోని ఇంజినీర్లు, ఉద్యోగులు, వారి బంధువులు 4,500 మంది ప్రధాని మోదీకి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వీరిలో ఎక్కువ మంది హైద్రాబాదిలే ఉన్నారు. ఆన్లైన్ ప్రకటనలు క్లిక్ చేస్తే రూ.లక్షల ఆదాయం వస్తుందంటూ మోసాలకు పాల్పడిన సోషల్‌ట్రేడ్ సంస్థ హైదరాబాద్‌లో 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క క్లిక్కు రూ.5 చొప్పున రోజుకు రూ.500, రూ.1000 వరకూ లాభం వస్తుందని నమ్మిన సభ్యులు హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉన్నారని పోలీసులు అంచనా వేశారు. సోషల్‌ట్రేడ్ డైరెక్టర్ అనుభవ్ మిట్టల్‌ను రెండు రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కంపెనీలో సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. సాఫ్ట్వేర్ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సోషల్‌ట్రేడ్ బృందాలున్నాయి. సోషల్‌ట్రేడ్ వెబ్సైట్ శుక్రవారం నుంచి పనిచేయకపోవడంతో రాచకొండ పోలీసులకు ఐదుగురు, సైబరాబాద్‌లో ఇద్దరు ఫిర్యాదు చేశారు. సోషల్‌ట్రేడ్, బాధితులకు మధ్య లావాదేవీల సాక్ష్యాలను తీసుకున్నాక కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.
ఫ్రెండ్జ్‌అప్‌గా కంపెనీగా పేరు మార్పు
సోషల్‌ట్రేడ్ పేరుతో కంపెనీని నిర్వహిస్తున్న అనుభవ్మిట్టల్ తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అనుమానంతో జనవరి 25న 'ఫ్రెండ్జ్‌అప్'గా కంపెనీ పేరు మార్చాడు. సోషల్‌ట్రేడ్‌లో ఉన్న సభ్యులందరూ 'ఫ్రెండ్జ్‌అప్' కంపెనీకి మారిపోవాల్సిందిగా ప్రకటించాడు. ఇకపై ప్రకటనలు కాకుండా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తరహాలో వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తామని, వస్తువులు కొనుగోలు ద్వారా వచ్చే పాయింట్లను నగదుగా మార్చుకోవచ్చని వెబ్సైట్లో పేర్కొన్నాడు. ఈ-కామర్స్ వ్యాపారంగా మారిపోతున్న నేపథ్యంలో సభ్యులకు ప్రస్తుతం కన్నా ఎక్కువ లాభాలొస్తాయంటూ వివరించారు. సోషల్‌ట్రేడ్ ద్వారా నష్టపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారని పోలీసుల అంచనా. ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగుల్లో చాలామంది రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. క్లిక్‌లు కొట్టిన మొత్తం సోమ, మంగళవారాల్లో బ్యాంకు ఖాతాల్లో పడుతుండడం, రెండు, మూడు నెలల్లోనే సభ్యత్వం మొత్తంలో 20 నుంచి 30 శాతం వరకూ తిరిగివస్తుండడంతో రోజూ కొత్తగా చేరుతున్నారు. హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో 500 మంది ఇంజినీర్లు, సిబ్బంది ఆరు నెలల క్రితం సభ్యులుగా చేరారు. సాఫ్ట్వేర్ ఉద్యోగమైనందున ప్రకటనలు క్లిక్ చేయడాన్ని కూడా విధుల్లో భాగంగా మార్చుకున్నారు. ఏడాది ప్రీమియం రూ.57,500 చెల్లించి సభ్యులుగా చేరిన వారికి వారం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో కుటుంబసభ్యుల పేరుతో కూడా సభ్యులుగా చేరారు. ఇలా ఆరునెలల వ్యవధిలోనే ఐదు వేల మంది సభ్యులయ్యారు.
సీసీఎస్‌లో ఫిర్యాదు చేయండి
సోషల్‌ట్రేడ్ ద్వారా మోసపోయినవారు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. కేసుల నమోదు అనంతరం నోయిడా పోలీసులతో మాట్లాడి తదుపరి చర్యలు చేపడతామన్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధుల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేశ్‌భగవత్ తెలిపారు.
- Tags
- సోషల్‌ట్రేడ్