సొంత పార్టీ పెడుతున్నా ... 234 సీట్లలో పోటీ క్లారిటీ ఇచ్చిన కబాలి ..

తమిళ సాంబార్ రాజకీయాలు సల సల కాగిపోనున్నాయి. తన పొలిటికల్ ఎంట్రీపై ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ అభిమానుల సమక్షంలో మొత్తానికి తేల్చేశారు. రాజకీయాల్లోకి వచ్చేశా కాసుకోండని తమిళనాట అన్ని పార్టీలకు సవాల్ విసిరేశారు. 234 స్థానాల్లో సొంత పార్టీ స్థాపించి పోటీకి సిద్ధమని స్పష్టం గా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. రాజకీయాలంటే తనకు భయం లేదని మీడియా అంటేనే భయమంటూ పంచ్ విసిరారు తలైవా.
గీతా శ్లోకాన్ని వల్లెవేసిన రజని ...
ఆధ్యాత్మిక భావనలతో గడిపే రజనీకాంత్ కీలకమైన రాజకీయ పార్టీ ప్రకటన చేసిన సమయంలో భగవత్ గీత లో కృష్ణుడు అర్జునుడు కి చెప్పిన శ్లోకాన్ని వల్లెవేశారు. కర్మలను బట్టే జీవితం నిర్ణయించబడుతుందని మన పని మనం చేసుకుంటూ ఫలితం ఆశించకుండా సాగిపోవడమే తన కర్తవ్యం గా ఆ శ్లోకం అర్ధాన్ని వివరించారు. తనను రాజకీయాల్లోకి రావొద్దంటూ జయ అనుచరులు బెదిరించారని ఘాటైన ఆరోపణలు సంధించారు. రాజకీయాల్లోకి వస్తున్నది పదవి పేరు కోసం కాదని రజని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చే తరుణం అవసరం ఉందన్నారు. కొన్ని పార్టీలు తమిళనాడు ప్రతిష్ట కు మచ్చ తెచ్చాయని విమర్శలు గుప్పించారు కబాలి. రజని తాజా ప్రకటనతో అభిమానులకు ఒక రోజు ముందే కొత్త ఏడాది సంబరం ఆరంభం అయినట్లు అయ్యింది. రజని సమావేశం నిర్వహించిన రాఘవేంద్ర కల్యాణ మండపం ఫ్యాన్స్ జోష్ తో హోరెత్తిపోయింది.
- Tags
- రజనీకాంత్

