సై సినిమా చూపించిన బెజవాడ స్టూడెంట్స్...!

అమరావతిlr రాజధానిగా ప్రకటించాకా భూముల విలువ విజయవాడ, గుంటూరు లలో చుక్కలు నంటాయి. కాదేది కబ్జాకు అనర్హం అనే రీతిలో కనిపించిన వాటినల్లా ఆక్రమించేస్తున్నారు కబ్జా దార్లు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, పోరంబోకు స్థలాలు నకిలీ పత్రాలు సృష్ట్టించి లాగేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు లకు ఎక్కి లిటిగేషన్ మొదలు పెడుతున్నారు. వీరికి రెవెన్యూ, కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అందండలు పుష్కలంగా ఉంటున్నాయి. దాంతో కబ్జా దారుల తో పోరాడే ఓపిక లేక చాలా ప్రభుత్వ, ప్రయివేట్ స్థలాలు అక్రమార్కుల చేతుల్లోకి పోతున్నాయి. సేమ్ టూ సేమ్ ఇలాగే ఒక ప్రభుత్వ కళాశాలకు చెందిన స్థలాన్ని తమదంటూ కొందరు చేసిన ప్రయత్నాన్ని విద్యార్థులు తాజాగా అడ్డుకున్నారు. రాజమౌళి చిత్రం "సై " రిపీట్ చేశారు బెజవాడ విద్యార్థి బెబ్బులులై.
అక్రమకట్టడాలను తొలగించి ....
విజయవాడ నడిబొడ్డున వున్న ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్రే వుంది. ఈ కళాశాలకు చెందిన 10 ఎకరాల ఖాళీ స్థలం కబ్జాలకు గురై ఇప్పుడు రెండు ఎకరాలు మాత్రమే మిగిలింది. ప్రభుత్వ కళాశాల కావడం ఈ కబ్జాలపై దృష్టి పెట్టకపోవడంతో ఎవరికివారే ఆక్రమణలు చేయడం మొదలెట్టారు. ఈ ఆక్రమణల వెనుక డబ్బు పలుకుబడి, రాజకీయం, న్యాయవాదులు అండగా నిలిచారు. దాంతో కబ్జాదారులు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే శాశ్విత భవనాలు నిర్మించేస్తున్నారు. ఈ భాగోతం ఎన్నాళ్ళు ఇలా చూస్తూ ఊరుకోవాలని భావించిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పలుగు పారా చేతబట్టారు, ప్రొక్లెయిన్లు సైతం పెట్టించి అక్రమ నిర్మాణాలను తామే స్వయంగా కూల్చేయడం మొదలు పెట్టారు. ఇది విజయవాడలో సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళినా వేలాదిమంది విద్యార్థులను చూసి ఏమిచేయలేక వెనుతిరిగారు. ఇప్పటికైనా సర్కార్ మొద్దు నిద్ర వదిలి విలువైన విద్యాసంస్థల స్థలాలు కాపాడాలని కోరుకుంటున్నారు. ఈ కబ్జాలవెనుక వున్న రాజకీయ శక్తులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ భూ వివాదం వెనక అధికార పార్టీకిచెందిన ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందని పూర్వవిద్యార్థులు ఆరోపిస్తున్నారు.
- Tags
- విజయవాడ

