సైన్యం కంటె దృఢంగా తేల్చేసిన పారికర్

'మన సైన్యం ధైర్య సాహసాలను నమ్మండి. కనీసం మన సైనికుల ధైర్య సాహసాలను అనుమానించాల్సిన అవసరం లేదు. వీడియోలను బయటపెట్టడం అనేది మన సైనికుల సాహసాన్ని అవమానించడమే అవుతుంది. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను బయటపెట్టబోయేది లేదు. వీడియోలు అడుగుతున్న వారు, మన సైన్యాన్ని, దేశాన్ని అవమానిస్తున్నారు...' ఇవీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు. పాకిస్తాన్ దుందుడుకు వేషాలకు భారత సైన్యం ఎంత దృఢంగా అయితే సర్జికల్ దాడులతో సమాధానం ఇచ్చిందో... రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా.. అదే తరహాలో చాలా నిక్కచ్చిగా తేల్చిచెప్పేశారు.
మనదేశం జరిపిన సర్జిల్ దాడుల వీడియోలను బయటపెట్టాలంటూ ఒక వైపు పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంటే.. వారికి మద్దతుగా చిడతలు వాయిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజయ్ నిరుపమ్ వంటి కొందర నాయకులు, కేజ్రీవాల్ లాంటి వారు డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అయితే.. తన సహజశైలిలో.. వీడియోలు చూపించకపోవడాన్ని బట్టి.. అసలు దాడులే జరగలేదనే అనుమానం వ్యక్తం అయ్యేలా చాలా వెటకారంగా కూడా స్పందించారు.
ఇలాంటి నేపథ్యంలో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక నాయకులతో సమావేశం పెట్టుకుని.. దాడులకు సంబంధించి తనను కీర్తిస్తూ ప్రకటనలు చేయవద్దని అందరినీ మూకుమ్మడిగా హెచ్చరించిన వైనం కూడా తెలిసిందే. సైన్యం ఆత్మగౌరవాన్ని కాపాడడమే తమ కర్తవ్యం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం భేషైన నిర్ణయం తీసుకుంది. సర్జిల్ దాడుల వీడియోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరాదని నిర్ణయించింది. పారికర్ ప్రకటన పట్ల జాతీయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

