సీనియారిటీ, విధేయత.. ఇవిచూసే ఛాన్సిచ్చిన బాబు!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంస్థాగత వ్యవహారాల మీద దృష్టి పెట్టింది. ఇవాళ్టినుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. చంద్రబాబునాయుడే 100 రూపాయలు చెల్లించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముమ్మరంగా సభ్యత్వ నమోదులు చేయించే ప్రయత్నంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఎవ్వరినీ బలవంతంగా పార్టీలో చేర్పించవద్దని ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపు ఇచ్చారు.
అదే సమయంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి కూడా రంగం సిద్ధం అవుతోంది. ఎన్నికల సమన్వయ కర్తలను చంద్రబాబునాయుడు నియమించారు. ఏపీ లో పార్టీ ఎన్నికలకు హోం మినిస్టర్ చిన రాజప్ప, తెలంగాణలో పెద్దిరెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు. విధేయతకే పెద్దపీట వేసే చంద్రబాబు, విధేయతతో పాటు సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
సంస్థాగత ఎన్నికల పర్వం పూర్తయ్యేసరికి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇటీవలే నియమితులైన రాష్ట్ర అధ్యక్షులే ఉంటారు.. వారిని కూడా కొత్తగా మారుస్తారా అనే విషయం మాత్రం తెలియడం లేదు.

