సీఎం ల కమిటీ కూర్పుపై మోదీ విలక్షణత!

మొత్తానికి 20రోజుల జనం కష్టాలు చూసిన తర్వాత అయినా.. తమ తరఫునుంచి ఎంతో కొంత స్పందన కనిపించాల్సిందేనని మోదీ సర్కారు భావించినట్లుంది. జనం కష్టాలు పడుతున్నారని, వాటిని ఒక కొలిక్కి తేవడానికి, పరిష్కరించడానికి క్రియాశీలంగా వ్యవహరించడం ప్రధానమనే ఉద్దేశంతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఏ కేంద్రమంత్రులతోనో ఒక కమిటీని ఏర్పాటుచేసి ఉన్నా, పార్లమెంటరీ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నా ప్రధాని నరేంద్రమోదీకి మరింత బాధ్యత ఉండేది గానీ.. క్షేత్రస్థాయినుంచి పరిష్కార మార్గాలకు విలువ ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లుగా మోదీ సీఎం ల కమిటీని ఏర్పాటు చేశారు. అయితే.. అయిదుగురు ముఖ్యమంత్రులతో కమిటీని ఏర్పాటు చేయగా.. అయిదుగురినీ.. అయిదు పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల్ని కమిటీలో పెట్టడం ఆయన విలక్షణతకు నిదర్శనంగా ఉంది.
నగదు రహిత లావాదేవీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి ఏం చేయాలి? నోట్ల రద్దు వలన ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తక్షణం తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేదిశగా ఈ సీఎం ల కమిటీ సూచనలు చేస్తుంది. వాటిని ఆచరణలోకి తీసుకురావడం కేంద్రం బాధ్యత. ఈ కమిటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఉంటారని వార్తలు వస్తున్నాయి.
ఈ కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సారథ్యం వహిస్తారు. ఈమేరకు సారథ్యం గురించి జైట్లీ సోమవారం మధ్యాహ్నం ఫోను చేసి అడిగినప్పుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. బ్యాంకర్లు అసలు సహకరించడం లేదు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఏమీ పరిష్కారం కావడం లేదు. సారథ్యం గురించి ఆలోచించి చెబుతా అంటూ తిరస్కరించినట్లు సమాచారం. అయితే జైట్లీ గట్టిగా అడగడంతో చంద్రబాబు తర్వాత ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సీఎం ల కమిటీ కూర్పులోనే మోదీ సర్కారు విలక్షణత కనిపిస్తోందని.. భాజపా, తెలుగుదేశం ఎన్డీయే పక్షాలే అయినా.. కాంగ్రెస్ నారాయణస్వామి, సీపీఎం మాణిక్ సర్కార్, మామూలుగా మోదీని తెగ తూర్పారపడుతూ ఉండే జేడీయూకు చెందిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ లకు చోటు ఇవ్వడం.. కేంద్రం వ్యూహమేనని పలువురు అంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అందరి ఆలోచనల భాగస్వామ్యం కోసమే ఇలాంటి కమిటీని ఏర్పాటుచేసినట్లుగా చెబుతున్నారు.

