సీఎం, డిప్యూటీ సీఎం మధ్య వార్ మొదలయిందా?

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేం. తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు తలెత్తాయన్న టాక్ అరవ రాజ్యంలో బలంగా విన్పిస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. పన్నీర్ సెల్వం నేరుగాప్రధానిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది. జయలలతిత మరణించిన నాటి నుంచి పన్నీర్ సెల్వానికి హస్తిన సర్కార్ మద్దతిస్తూ వస్తోంది. పన్నీర్ పట్ల కమలనాధులు సానుకూలంగా ఉన్నారు. అందుకోసమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిశారు. అయితే పన్నీర్ సెల్వం వెంట పళనిస్వామి వర్గానికి చెందిన విద్యుత్ శాఖ మంత్రి తంగమణి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే ప్రధానితో భేటీ అయిన సమయంలో తంగమణిని పక్కన పెట్టి తనకు సన్నిహితుడైన మైత్రేయన్ ను పన్నీర్ సెల్వం తీసుకెళ్లారు. దీంతో పళనిస్వామి కొంత ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
పన్నీర్ పై నిఘా పెట్టిన పళని......
శశికళ, దినకరన్ వర్గాలను ఢీకొట్టాలన్నా, కేంద్రప్రభుత్వ మద్దతు కావాలన్నా పన్నీర్ సెల్వంతో కలవక తప్పని పరిస్థితి పళనిస్వామిది. అందుకోసమే పన్నీర్ సెల్వం విధించిన షరతులన్నింటికీ అంగీకరించి ఆయనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పించారు పళనిస్వామి. కాని పన్నీర్ సెల్వానికి మాత్రం మనసంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉందని తెలుసుకున్న పళనిస్వామి పన్నీర్ కదలికలపై నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తోంది. పన్నీర్ ఢిల్లీ వెళ్లి ఎవరెవరిని కలిసి, ఏమేం మాట్లాడిందీ కూడా పళనివర్గం సేకరించింది. దీంతో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో వీరి మధ్య విభేదాలు విజయావకాశాలు దెబ్బతీస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు దినకరన్ వర్గం పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తిరుచ్చిలో దినకరన్ మీడియాతో మాట్లాడారు. అతి త్వరలోనే పళని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. మొత్తం మీద తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మరోసారి మారే అవకాశాలున్నాయి.
- Tags
- తమిళనాడు

