సినిమాలకు కష్టకాలం మొదలైందే ...!

ఆ భాష ఈ భాషా అని లేదు. సినిమాలకు ఇప్పుడు కష్టకాలం సంభవించింది. తమిళనాడులోని మెర్సిల్ చిత్రం ఇటీవల వివాదాస్పదం అయితే, ప్రస్తుతం సంజయ్ బన్సాలి తీసిన పద్మావతి దేశవ్యాప్తంగా వివాదాల దుమ్ము కొనసాగిస్తూనే వుంది. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ నటి జ్యోతిక నటించి ఇంకా రిలీజ్ కానీ నాచియర్ చేరిపోయింది. ఈ చిత్రంలో జ్యోతిక కొట్టిన ఒక డైలాగ్ టీజర్ లో రిలీజ్ కావడం తమిళనాడులో అది సంచలనంగా మారి కేసులు నమోదు అయ్యేలా చేసింది. జాతీయ అవార్డీ బాలా దర్శకత్వంలో రూపొందుతున్న నాచియర్ లో మగవాళ్ళు సైతం పలకడానికి ఇష్ట పడని డైలాగ్ ను జ్యోతిక పోలీస్ అధికారిణి పాత్రలో చక్కగా పలికారు. ఆ డైలాగ్ ఇప్పుడు చిత్రాన్ని వివాదాస్పదంగా మార్చింది. నటి జ్యోతిక, దర్శకుడు బాలా లపై కేసులు నమోదు అయ్యే వరకు వెళ్ళింది.
పద్మావతికి మద్దత్తుగా కదిలిన ఇండస్ట్రీ ...
పద్మావతికి మద్దతుగా బాలీవుడ్ రంగంలోకి దిగింది. ముంబయి లో పరిశ్రమ వర్గాలన్నీ ఒక్కతాటిపై నిలిచి భావప్రకటనా స్వేచ్చకు విరుద్ధంగా దేశంలో చిత్ర పరిశ్రమ పై జరుగుతున్న దాడులను నిరోధించాలని డిమాండ్ చేస్తున్నాయి. చిత్ర ప్రదర్శనలు సైతం పావుగంటపాటు నిలిపివేసి నిరసన వ్యక్తం చేయాలని బాలీవుడ్ నిర్ణయించింది. పద్మావతి చిత్రం విడుదల నిలిపి వేయాలంటూ కర్ణి సేన చేస్తున్న దాడులతో ఉత్తరాదిలో థియేటర్లు వణుకుతున్నాయి. తమకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ తో బాలీవుడ్ చేస్తున్న ఉద్యమం ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.

