సిద్ధూకు రాహుల్ గీతోపదేశం...!

కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ హస్తినకు చేరింది. త్వరలోనే కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించడమే లక్ష్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు కన్నడ నేతలలతో కీలక సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కొనాలన్న దానిపై సీనియర్ నేతలతో కలిసి చర్చించారు. గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం బాగా కలిసొచ్చింది. అలాగే కర్ణాటకలో కూడా వీలయినన్ని ఎక్కువ సభలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. బీజేపీ ఎప్పటికప్పుడు అనుసరిస్తున్న వ్యూహాలను తిప్పికొట్టడంపై కూడా చర్చ జరిగింది.
వ్యూహరచన కోసం...
కర్ణాటక ఎన్నికలు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోనే జరగనున్నాయి. ఇప్పటికే అమిత్ షా కర్ణాటకలో రెండు రోజులు పర్యటించి నేతలకు దిశానిర్దేశం చేసి వచ్చారు. ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పట్టును పెంచుకునేందుకు వ్యూహరచన చేయాలని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. సిద్ధరామయ్య ప్రభుత్వం పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోవడం తమకు కలిసి వచ్చే అంశంగా కన్నడ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఆడుతున్న హిందుత్వ నాటకం కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరని ఈ సందర్భంగా కన్నడ నేతలు రాహుల్ కు వివరించినట్లు తెలుస్తోంది.
అంతర్గతంగా విభేదాలు...
అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. సిద్ధరామయ్య నాయకత్వాన్ని కాంగ్రెస్ లో కొందరు ఇష్టపడటం లేదు. సిద్ధరామయ్య జనతా దళ (ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను సిద్ధూ పట్టించుకోలేదన్న విమర్శ పార్టీలో బలంగా విన్పిస్తోంది. ఇటీవల జరిగిన నంజనగూడు, గుండ్లుపేట శాసనసభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య నియంతలా వ్యవహరిస్తున్నారని పార్టీ ముఖ్యనేతలు కొందరు బహిరంగంగానే అధిష్టానానికి లేఖ రాశారు. సీనియర్లు సిద్ధూ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల సిద్ధరామయ్య నిర్వహించిన నవ కర్ణాటక యాత్రకు కూడా సీనియర్లు దూరంగా ఉండటంతో రాహుల్ హడావిడిగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
సీనియర్లకు న్యాయం....
పార్టీలో సీనియర్లకు ఎలాంటి అన్యాయం జరగదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్లందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవకాశాలు కల్పిస్తామని ఆయన సమావేశంలోనే చెప్పడం విశేషం. అలాగే సిద్ధరామయ్య నాయకత్వం పట్ల రాహుల్ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు. అయితే అధికారంలో ఉండటంతో ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని రాహుల్ కన్నడ నేతలకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బాధ్యులను నియమించి అక్కడ ప్రచార బాధ్యతలను సీనియర్లకు అప్పగించాలని కూడా రాహుల్ సిద్ధరామయ్యకు సూచించారు.

