సింగపూర్ ప్రధాని అమరావతికి రావట్లేదు!

అమరావతి నగర నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలే చేపట్టబోతున్నాయి. సింగపూర్ ప్రభుత్వమే భాగస్వామిగా ఈ రాజధాని నగర నిర్మాణాలకు పూనిక వహించబోతోంది. ఇదంతా చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం. అయితే తాజాగా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను కూడా రద్దు చేసుకోవడం సందేహాస్పదంగా మారుతోంది. చంద్రబాబునాయుడు.. తనకోసం సింగపూర్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకున్నారు అన్నంతగా బిల్డప్ ఇచ్చినప్పటికీ, కనీసం ఇప్పుడు అక్కడి ప్రధాని భారత పర్యటనలో ఉన్న సమయంలో అమరావతి వైపు కూడా రాకపోవడం ఆలోచించాల్సిందే. అయితే ఇదంతా స్విస్ ఛాలెంజ్ విధానంపై రగడ రేగడం, అవినీతిపుకార్లు వచ్చినందువల్లనే అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది.
సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ ప్రస్తుతం భారత్ లో అయిదురోజుల పర్యటనలో ఉన్నారు. ఈ ట్రిప్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని కూడా సందర్శిస్తారని చంద్రబాబునాయుడు చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే సతీ సమేతంగా భారత పర్యటనలో ఉన్న లూంగ్, షెడ్యూలు ప్రకారం 7వ తేదీన అమరావతికి రావాల్సి ఉంది. రెండు రోజులు ఢిల్లీలోనే కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాజస్తాన్‌లో అధికారిక కార్యక్రమాల నిమిత్తం వెళుతున్నారు. అయితే అర్థంతరంగా అమరావతి ప్రోగ్రాం రద్దయినట్లుగా తెలుస్తున్నది.
ఎంతో క్రమశిక్షణతో ప్రణాళికతో షెడ్యూళ్లు ప్లాన్ చేసుకునే సింగపూర్ దేశీయుల ప్రధాని ఇలా ఏకంగా చివరి నిమిషంలో ఏపీ టూర్ రద్దు చేసుకోడానికి కారణం.. స్విస్ చాలెంజ్ విషయంలో రేగుతున్న సందేహాలు, సింగపూర్ సంస్థలపై అనుమానాలు నేపథ్యమే అని తెలుస్తోంది. స్విస్‌ఛాలెంజ్ మొత్తం అవినీతి మయం అంటూ కోర్టులో ప్రస్తుతం పిటిషన్లు విచారణ నడుస్తున్నాయి. సింగపూర్ సంస్థలకు సాంతం అప్పగించేసేలా రూపొందించిన టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం సస్పెన్స్‌లో ఉంది. అందుకే ప్రధాని లీ సెయిన్ లూంగ్ రావడం లేదని కొందరు అనుకుంటున్నారు.

