సారీ.. ఆ..ఇద్దరి ప్రమోషన్ ఆగిపోయిందే...!

సారీ.... టీడీపీలో ఆ ఇద్దరి ప్రమోషన్ ఎందుకు ఆగింది...? ఒకరు కిమిడి మరొకరు కింజరాపు కుటుంబాల ప్రతినిధులు. తిరుగులేని నేతలు వారే అచ్చెన్న, కళా వెంకట్రావు. నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక కీలక స్థానాలు దక్కించుకున్నారు. పార్టీ వీర విధేయతకు సంకేతంగా నిలిచారు. కాని క్రమంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వీరి ప్రాధాన్యత తగ్గుతూవస్తుంది. దానికి కారణాలు అనేకం.
సిక్కోలు రాజకీయాల్లో...
సిక్కోలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది ఆ రెండు కుటుంబాలే.. టీడీపీ ఆవిర్భావం నుంచి కింజరాపు కుటుంబం తనదైన పురోగమనాన్ని సాధించింది. దివంగత ఎర్రన్నాయుడు ఓ సామాన్య స్థాయి నుంచి వచ్చి అసామాన్య నేతగా ఎదిగారు. ఓ దశలో సిక్కోలు అంటే ఎర్రన్నే అని తలపించేలా చేశారు. లా పట్టా పుచ్చుకున్న ఆ కుర్రాడు అనూహ్యంగా ఎన్టీఆర్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఎదురులేని నేతగా ఎదిగాడు.ఆ..రోజుల్లోనే ఆయనతో పాటు గౌతు శ్యాం సుందర్ శివాజీ (ప్రస్తుత పలాస ఎమ్మెల్యే) అడుగులో అడుగు వేశారు. ఒకరు హరిశ్చంద్రపురం, ఒకరు సోంపేట నియోజకవర్గం నుంచి ఎన్నికై ఇద్దరూ ఒకే లెటర్ హెడ్ ని మెయింటైన్ చేసి జిల్లా సమస్యలపై పోరాడారు. ఎర్రన్న ఉంటుండగానే ఇటుగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ అన్నచాటు తమ్ముడిగా అచ్చెన్న కొంతకాలం ఉండిపోయారు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనుతో నువ్వా నేనా అని తలబడి ఎనిమిదివేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అచ్చెన్న ద ట్రబుల్ షూటర్....
కీలక సమయాల్లో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు. కాపు ఉద్యమ సమయంలో ప్రభుత్వ దూతగా ఉండి ముద్రగడతో చర్చలు నెరపి సఫలీకృతులయ్యారు.అదేవిధంగా కన్నెధార లీజుని రద్దు చేస్తూ జీఓ విడుదల విషయమై కూడా తనదైన చొరవచూపారు. నిన్న మొన్నటి వేళ ఉద్యోగుల హెచ్ ఆర్ పెంపు విషయమై కూడా ఆయనే దగ్గరుండి సమస్యని పరిష్కరించి జీఓ విడుదలయ్యేలా చేశారు. దీని ఫలితంగానే ఎప్పటినుంచో ఇస్తామంటున్న ఇరవై శాతం అద్దెభత్యంను శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరు పట్టణాల ఉద్యోగులు అందుకోనున్నారు. అంతేకాదు అసెంబ్లీలోనూ జగన్ కు చెక్ పెట్టడంలో అచ్చెన్ననే ముందుంచారు టీడీపీ బాస్. మిగతా నేతలు కన్నా రెడ్డి సామాజికవర్గం నేతల కన్నా ఎక్కువ మాట్లాడింది ఓ విధంగా తనని తాను ఇరకాటంలో పెట్టుకున్నది కూడా అచ్చెన్నే.!
అచ్చెన్న దూకుడు తగ్గిందే...
తొలుత కార్మిక శాఖ అప్పగించి, అటుపై బీసీ సంక్షేమం కేటాయించి ఇప్పుడిప్పుడే ఆయన ప్రాధాన్యం సైతం సీఎం తగ్గిస్తూ వచ్చారు. బహిరంగ రహస్యం.కనుక ఒకనాటి అచ్చెన్న వేరు ఇప్పటి అచ్చెన్న వేరు.అందుకనో ఎందుకనో ఆయన దూకుడు తగ్గింది. శ్రీకాకుళంలో కీలకంగా మారిన పోలాకి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్మ ఆయన నెత్తికి చుట్టుకుంది.ఇది ఆయన నియోజకవర్గ పరిధిలోనిదే కావడం కమ్యూనిస్టుల గొడవ తారాస్థాయిలో ఉండడంతో ఏం చేయాలో ఎవ్వరికీ పాలుపోవడం లేదు. అప్పట్లో ధర్మానకు థర్మల్ ప్రాజెక్టులు ఎలా కళంకం తెచ్చాయో ఇప్పుడు ఈ ప్రాజెక్టు అచ్చెన్నకు ప్రాణసంకటంలా మారింది. ఇవే కాక జిల్లాకు ఆయన తెస్తానన్న కొన్ని కీలక ప్రాజెక్టులు కనీసం డీపీఆర్ కు కూడా నోచుకోలేదు. భావనపాడు ఫిషింగ్ హార్బర్ కి ఇప్పటికీ స్థల సమస్యే ప్రధాన కారణం. అలానే ఉద్దానం సమస్య, ఆయన నియోజకవర్గంలో సైతం కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే సరైన పరిష్కార మార్గంనిస్సహాయతలో ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఆయన నియోజకవర్గ సమస్యలపైనే దృష్టిసారించి కొంతకాలం రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకనో ఎందుకనో కొంత స్పీడ్ తగ్గించి నిదానించి ఆలోచించి నిర్ణయాలు వెలువరించేందుకు ఇష్టపడుతున్నారు. సీఎం పేషీ నుంచి కాస్త ఎడం పాటించేందుకు ఇది కూడా ఓ కారణం.
కాపు నేత కళా...
జిల్లాలో కాపు నేతగా , నవ్యాంధ్ర టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి కళావెంకట్రావుకు మంచి పేరుంది. అచ్చెన్నలా ఈయన ఆవేశపరుడు కాదు. వివాద రహితుడు.గతంలో ఎన్టీఆర్ హయాంలో కీలక పదవులు అందుకున్నారు.అప్పట్లో ఉణుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు.పీఆర్పీ వచ్చాక చిరుతో అడుగులు వేశారు.కానీ అవేవీ ఫలించలేదు. దీంతో నాటి ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికే పరిమితం అయ్యారు. ఈయన బంధువు కిమిడి మృణాళిని శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. అటుపై నిన్నమొన్నటి బాబు క్యాబినేట్ లో మంత్రిగా చేశారు కూడా! ఆ తరువాత ఆమెని తప్పించి సీన్ లోకి కళాని తెచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించి లోకేశ్ కి చేరువయ్యారు. దీంతో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ హయాంలో హోం శాఖని నిర్వర్తించినందున నిన్నమొన్నటి వరకూ ఆ స్థాయి పదవి ఏదైనా కట్టబెడతారన్న వార్తలు వచ్చాయి. ఆర్థిక శాఖను యనమల నుంచి తప్పించి ఈయనకు అప్పగిస్తారన్న ఊహాగానాలువచ్చాయి. కానీ అవేవీ ఇప్పట్లో సాధ్యం కానివని తేలిపోయింది.
కళాపై పెద్ద బాధ్యతలు...
వచ్చే ఎన్నికల్లో అటు రాజాం, ఇటు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ రెండింటినీ కలుపుకుని ఉన్న విజయనగరం ఎంపీ స్థానం గెలుపునకు సైతం ఈయన కృషిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన నియోజకవర్గం(ఎచ్చెర్ల) లోనే వివాదాస్పద కొవ్వాడ అణుప్లాంట్ నిర్మాణం ప్రతిపాదిత దశలో ఉంది.అదేవిధంగా ఉన్నత విద్యాసంస్థలు అయిన ట్రిపుల్ ఐటీ, బీఆర్ ఏయూ కూడా ఉన్నాయి.ట్రిపుల్ ఐటీకి సొంత గూడు లేదు. బీఆర్ ఏయూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ కానీ ఎక్విప్మెంట్ కానీ లేవు. వీటి ఏర్పాటుకు సంబంధిత సమస్యల పరిష్కారానికి ఆయన చూపుతున్న చొరవ అంతంత మాత్రమే! కనుక ఇప్పటికిప్పుడు ఆయనకు ఆర్థిక శాఖ దక్కడం అంటే అది ఆశించినంత సులువు కాదు. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గాని కే చెందిన మాజీ స్పీకర్ , మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతికి కూడా కీలక పదవులు ఊరిస్తూనే ఉన్నాయి.వాటిలో ఒకటి ఆ మధ్య ఆమెకు శాసనమండలి ఛైర్మన్ గా నియమిస్తారని వార్తలొచ్చాయి. చక్రపాణి పదవీ కాలం ముగిశాక ఈ పదవివికి ఆమె పేరు పరిశీలించారు కూడా.. తాజాగా సమాచార హక్కు కమిషనర్ గా ఆమెని నియమించే ఛాన్స్ ఉందని వార్తలొచ్చినా ఇప్పుడిదే పదవికి రేపో మాపో పదవీవిరమణ చేయనున్న డీజీపీ సాంబశివరావుకు కేటాయించే అవకాశాలున్నాయిని వార్తలొస్తున్నాయి.

