సర్జికల్ దాడులకు జై కొడుతున్న విపక్ష నాయకురాలు

విపక్ష నాయకులందరూ ఒకే తీరుగా ఉండకపోవచ్చు. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులు అసలు నిజమైనవి కానే కాదంటూ ఒకవైపు కొందరు విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తోంటే.. మరో విపక్షానికి చెందిన నాయకురాలు మాత్రం మరిన్ని సర్జికల్ దాడులు నిర్వహించాల్సిందేనని, అప్పటికి గానీ పాకిస్తాన్ కు బుద్ధి రాదని అంటోంది. పరోక్షంగా మోదీ సర్కారు చర్యలకు జై కొడుతోంది. ఈ నాయకురాలు మరెవ్వరో కాదు. వచ్చే ఏడాదిలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్న ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కోడలు. అందుకే ఇది చర్చనీయాంశం అవుతోంది.
సర్జికల్ దాడుల గురించి ఎస్పీ ఎలాంటి నెగటివ్ కామెంట్లు కూడా చేయలేదు గానీ... యూపీలో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మోదీ సర్కారుకు మైలేజీ వచ్చేలా సర్జికల్ దాడుల గురించి ఆమె ప్రస్తావించడం మాత్రం విశేషమే.
ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణయాదవ్ ఈ కామెంట్లు చేశారు. ఆమె రాబోయే ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు , ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో తాను కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీచేస్తున్నది గనుక.. అక్కడి ఓటర్ల మనసు గెలుచుకోవడానికి అపర్ణ యాదవ్ ఇలాంటి దాడుల అనుకూల ప్రకటన చేశారా? లేదా బుద్ధిపూర్వకంగానే సర్జికల్ దాడులను సమర్థిస్తున్నారా? అనేది మాత్రం సస్పెన్సే.

