సరైన సమయంలో సరైన నిర్ణయం
జనవరి 13 న ఎన్డిఎ ప్రభుత్వం కొత్త పంట బీమా పాలసీ (ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY) ఆమోదించింది. ఇప్పటికే ఉన్న రెండు పథకాలు, జాతీయ వ్యవసాయ బీమా పథకం (NAIS) మరియు మార్పు చేసిన NAIS ను ఈ కొత్త పథకం భర్తీ చేస్తుంది. కొత్త పథకం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుండి ఉనికిలోకి వస్తుంది.
గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన కరువు బారిన పడిన గ్రామీణ రైతుల బాధ పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న మొదటి పెద్ద అడుగు ఈ పథకం అని చెప్పుకోవచ్చు. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ తన 2015 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్ర కోట ప్రాకారాల నుండి జాతికి చేసిన వాగ్దానమే ఈ పథకం.
PMFBY వలన భారతదేశంలోని 13.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. మొత్తం 194,40 మిలియన్ హెక్టార్ల పంట ప్రాంతంలో ఇప్పటికే 25-27 శాతం కవరేజ్ వుండగా అది ఈ కొత్త పథకం తో 50 శాతానికి విస్తరింస్తుంది.
ఈ పథకం ప్రకారం రైతులు ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాలు మరియు నూనెగింజల పంటలకు 1.5 శాతం, రబీ సీజన్లో ఆహార ధాన్యాలు మరియు నూనెగింజల పంటలకు 2 శాతం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. పత్తి మరియు హార్టికల్చర్ వంటి వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ ప్రీమియం 15 శాతంగా ఉండగా భీమా మొత్తం మీద ఒక పరిమితి కుడా వుంది.
కాగా PMFBY కింద, బీమా మొత్తం పై ఎటువంటి పరిమితి వుండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (రైతు చెల్లించిన ప్రీమియం మినహా) బీమా మొత్తాన్ని 50:50 భాగస్వామ్యంలో భరిస్తాయి. వ్యయం అంచనా సుమారు 8000 కోట్ల వరకు ఉంది.
కొత్త పథకం కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వలన జరిగిన నష్టం, కోత నష్టం, జలమయం వలన జరిగిన నష్టం కొత్తగా కవరేజ్ కిందకు వస్తుంది.
క్లస్టర్ ఆధారంగా అన్ని జిల్లాలకు బీమా కంపెనీలు కేటాయిస్తారు. గ్రామ స్థాయిలో నష్టం అంచనాకు విస్తృతంగా సాంకేతికత మరియు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ లను ఉపయోగిస్తారు. రిమోట్ డ్రోన్లు వంటి సెన్సింగ్ టెక్నాలజీ కుడా పంట నష్ట శాతం అంచనాకు ఉపయోగించబడుతుంది. ఇరవై ఐదు శాతం వరకు నష్ట పరిహారం రైతు బ్యాంక్ ఖాతా కు వెంటనే జమ చేయబడుతుంది.
ప్రతికూల పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న భారతదేశంలోని రైతులను ఇటువంటి పథకం ద్వారా ఆదుకోవడం ఖచ్చితంగా అవసరం. భవిష్యత్తు లో 130 కోట్ల మంది ప్రజల ఆహార అవసరాలని తీర్చవలసిన భారత రైతులను ఈ పథకం చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాని ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యడం మరియు అమలులో ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అరికట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న అతి పెద్ద సవాలు.