సరిగ్గా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టారే ...?

వైసిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు నవంబర్ 2 నుంచి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అదే సమయానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అధికారపక్షం ప్లాన్ చేయడం చర్చనీయాంశం. ఈసారి శీతాకాల సమావేశాలు ఏపీలో పదిరోజులపాటు నిర్వహించాలని భవిషతున్నట్లు ఇప్పటికే స్పీకర్ ప్రకటించారు. దాంతో ఈ పదిరోజులు అసెంబ్లీ కేంద్రంగా రోజు విపక్షంపై దుమ్మెత్తిపోసేందుకు అధికారపార్టీ ఈ వేదికను వినియోగించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పాదయాత్రలో ఏం మాట్లాడినా అసెంబ్లీలో కౌంటర్ లు ఇచ్చేలా పక్కా వ్యూహంతో టిడిపి సిద్ధం అవుతున్నట్లు సమాచారం . ఆ విధంగా పదిరోజులపాటు ఏకధాటిగా పాదయాత్రను వీక్ చేసేలా అధికారపక్షం అస్త్రాలు సిద్ధం చేస్తుంది అంటున్నారు.
అసెంబ్లీ ని రోజా డీల్ చేస్తారా ..?
జగన్ పాదయాత్ర నిర్వహించే సమయంలో కీలక అసెంబ్లీ సమావేశాలను వైసిపి తరపున ఎవరు నిర్వహించాలనే అంశంపై ఆ పార్టీలో ఇంకా చర్చ నడుస్తుంది. జగన్ పాత్రను రోజాకు అప్పగిస్తే ఆమె మంత్రులు ఎమ్యెల్యేలు చేసే దాడిని సమర్ధవంతంగా తిప్పి కొడతారని కొందరు భావిస్తున్నారు . మరికొందరు వైసిపిలో వున్న సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి వంటివారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే హుందాగా సభలో వ్యవహరించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న నేపథ్యంలో నవంబర్ లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు విపక్ష పార్టీకి చాలా ముఖ్యమైనవే. అలాంటి తరుణంలో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపి ప్రజా సమస్యల ప్రస్తావనకు విపక్షం బాధ్యతాయుతంగా నడుచుకోవాలిసివుంది. మరి టిడిపి ఎత్తుగడలకు వైసిపి వ్యూహం ఏమిటో తేలాలి .
- Tags
- ఏపీ అసెంబ్లీ

