సంక్రాంతి తర్వాత వీరికి అసలైన పండగ...!

గులాబీ దళం బాస్ పై గుర్రుగా ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ పదవులను భర్తీ చేయకపోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల వివిధ నియోజకవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ద్వితీయశ్రేణి నేతలు పార్టీకార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసిన కేసీఆర్ వారికి పదవులిచ్చేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత వీరికి పదవులు ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే ఎవరెవరికి పదవులివ్వాలో జాబితాను ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ద్వితీయ శ్రేణి నేతలకు...
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాష్ట్ర స్థాయి నేతలకే నామినేటెడ్ పదవులు దక్కాయి. ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకోలేదు. ఇటు ఎమ్మెల్యేలు సయితం చూద్దామంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇన్నాళ్లూ ఆశగా ఎదురు చూసిన సెకండ్ లెవెల్ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయారు. హరితహారం నుంచి మిషన్ కాకతీయ వరకూ వాటిలో వీరి హాజరు అంతంత మాత్రమే. దీంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. పదవులు ఇవ్వనప్పుడు ఎందుకు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవాలన్నది వారి అభిప్రాయంగా ఉంది.
ఎమ్మెల్యేలను జాబితా కోరిన కేసీఆర్....
కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులను సయితం ఈవిషయంలో నేతలు నిలదీస్తున్నారు. ఇటీవల మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే ఒక నేత తనకు పదవి దక్కలేదని ఆత్మహత్య ప్రయత్నంచేసుకున్న సంగతితెలిసిందే. తర్వాత అతను మృతి చెందాడు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై కూడా మంత్రులను ప్రజలను నిలదీస్తున్నా ద్వితీయశ్రేణి నేతలు పట్టించుకోవడం లేదు. కనీసం ప్రజలకు సర్ది చెప్పే ప్రయత్నంచేయడం లేదు. ఇలానే సెకండ్ లెవెల్ క్యాడర్ ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని గ్రహించిన గులాబీ బాస్ పదవుల పంపకానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి ఆశావహుల జాబితాను పంపాల్సిందిగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేఖ వెళ్లింది. దీంతో సంక్రాంతి తర్వాత పదవుల పందేరం ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న కాలంలో కేసీఆర్ జిల్లాల పర్యటనకూడాచేయాల్సి ఉండటంతో వీరికి పదవులు లభించడం ఖాయంగా కన్పిస్తోంది.
- Tags
- కేసీఆర్

