శిల్పా కుటుంబంలో టెన్షన్

శిల్పా సోదరుల్లో ఆందోళన ప్రారంభమైంది. వారికి గన్ మెన్లు తొలగించడంపై శిల్పా కుటుంబంలో టెన్షన్ మొదలయింది. చెరుకుపాడు నారాయణరెడ్డి వైసీపీలో చేరిన వెంటనే ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. గన్ మెన్లను తనకు ఇవ్వాలంటూ నారాయణ రెడ్డి ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా నిబంధనలు అంగీకరించవని చెప్పారు. అయితే నారాయణరెడ్డి ప్రత్యర్థుల చేతుల్లో హతమయ్యారు. తాజాగా శిల్పా సోదరుల గన్ మెన్ల తొలగింపు వ్యవహారం నంద్యాలలో అగ్గిని రాజేసింది. శిల్పా మోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు 2 + 2 భద్రతను ఇప్పటి వరకూ ప్రభుత్వం కల్పించింది.
గన్ మెన్ల తొలగింపుపై ఆందోళన....
అలాగే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల వైసీపీలోకి మారడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు కూడా గన్ మెన్లను తొలగించారు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఇంకా అక్కడ అప్పుడప్పుడూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నిక పూర్తయిన కొద్దిరోజులకే తెలుగుదేశం పార్టీ నేత అభిరుచి మధుకు, శిల్పా చక్రపాణిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పా సోదరులకు ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమోనన్న ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లోనూ, సన్నిహితుల్లోనూ వ్యక్తమవుతోంది. దీనిపై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని శిల్పా సోదరులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఆందోళన చేయడానికి నంద్యాల వైసీపీ సిద్ధమవుతోంది. మరోవైపు ప్రత్యేక కమిటీ సూచనల మేరకే గన్ మెన్లను తొలగించారని, ఇందులో ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేవని కర్నూలు తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. కేవలం ప్రజల్లో సానుభూతిని పొందేందుకే శిల్పా సోదరులు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
- Tags
- శిల్పా కుటుంబం

