శభాష్... ఉండవల్లి, నాగేశ్వర్...!

ఏ విషయం అయినా విపులంగా చెబుతూ అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఆయనకు ఆయనే సాటి. ఇక మాజీ ఎమ్యెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు అలాగే అరటిపండు వలిచినట్లే ఉంటాయి. వీరిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీలో సభ్యులు గా ఉన్నారు. చట్టసభలు, నిధులు, విధులు పై మంచి పట్టున్న ఇద్దరు ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారని అంతా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్లే తక్కువ సమయమే మాట్లాడినా ఇద్దరి ప్రసంగాలు ఆకట్టుకునేలాగే సాగాయి. ఉండవల్లి హాస్యోక్తులతో మాట్లాడితే , ప్రొఫెసర్ నాగేశ్వర్ సూటిగా కేంద్ర, రాష్ట్రాలు చేసిన తప్పులను ఎత్తి చూపారు.
అందరికన్నా అన్యాయం చేసింది న్యాయవ్యవస్థే ...
ఏపీ విభజన లో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తే అక్కడ మరింత ఘోర పరిస్థితి ఎదురైందన్నారు ఉండవల్లి అరుణకుమార్. నాలుగేళ్లుగా సుప్రీం కోర్ట్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వాపోయారు. కాంగ్రెస్ అత్యంత దారుణంగా హేతు బద్ధత లేకుండా అడ్డగోలు విభజన చేసిందని అంతా గోల గోల చేసి చివరికి ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయండి బాబోయి అని విభజన చట్టం చెత్త అంటూనే అది ఆ చెత్త చట్టం అమలు చేస్తే చాలు అనే పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతానికి పవన్ బ్యాచ్ బాగానే సెట్ అయ్యిందని రాజకీయాలకు అతీతం అనే మాట రొటీన్ అయిపోయిందని రాజకీయం లేకుండా ఏమి లేదని అన్ని వ్యవస్థల్లోకి రాజకీయ వ్యవస్థలోనే అవినీతి తక్కువ అన్నారు ఉండవల్లి. ఎదుటివాడికి ఏదో చేయాలన్న తపనే రాజకీయమని పవన్ కళ్యాణ్ మొహమాట పడకుండా ఉద్యమాన్ని మధ్యలో వదిలేయకుండా కొనసాగించాలన్నారు. కమిటీలో సభ్యులుగా వున్న ఐవైఆర్, పద్మనాభయ్య వంటివారికి లెక్కలు తేల్చడం పావుగంట పని అని ఈ టీం ముందుకు సాగాలని ఆకాక్షించారు. ఇక బిజెపి అధ్యక్షుడు హరిబాబు ఢిల్లీ లో తాజాగా సమావేశం పెట్టినట్లు మెసేజ్ వచ్చిందని ఆయన లెక్కలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇస్తుందని డాక్టర్ జయప్రకాశ్ చెబుతున్నా అధికారికంగా వారిచేత ప్రకటన చేయించాలని ఉండవల్లి కోరారు. ఎన్నికల ఏడాది కావడంతో ఎవరిని నమ్మే పరిస్థితి లేదన్నారు అరుణ కుమార్.
లెక్కలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ....
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల లెక్కలన్నీ పబ్లిక్ డొమైన్ లో లభ్యం అవుతున్నాయన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. వీటిని విశ్లేషించడం పెద్ద పనేమీ కాదన్నారు ఆయన. పోలవరం ముంపు మండలాల కోసం ఆర్డినెన్స్ తెచ్చిన వారు ప్రత్యేక హోదాను చట్టంలో ఎందుకు చేర్పించడం లేదని తాను టివి చర్చల్లో అనేక సందర్భాల్లో ఎంపిలను ఇతర ప్రజాప్రతినిధులను కోరామన్నారు. కానీ ఏ ఒక్కరు దీనిని పట్టించుకున్న పాపానికి పోలేదని వాపోయారు నాగేశ్వర్. నాటి ప్రధాని మన్మోహన్ పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించుకోవడంలో ఎంపీలంతా విఫలం అయ్యారని విమర్శించారు. ఇక దుగ్గరాజపట్నం సాధ్యం కాకపోతే తొమ్మిది వందల కిలోమీటర్లకు పైగా వున్న సువిశాల తీరప్రాంతంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల పోర్టులను కేంద్రం నిర్మించాలన్నారు. గుజరాత్ కి ఒక న్యాయం ఆంధ్ర కు ఒక న్యాయం మోడీ సర్కార్ చేస్తుంటే చంద్రబాబు సర్కార్ నాలుగేళ్లుగా చూస్తూ ఊరుకోవడం ఏమిటని నిలదీశారు. కడప లో ఉక్కు ఫ్యాక్టరీ పైనా అదే నిర్లక్ష్యమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి టాటా, జిందాల్ వంటి ప్రయివేట్ వారికి గనులు కేటాయించినట్లే ప్రభుత్వ రంగ సంస్థ అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయింపు కోసం పోరాడాలిసి ఉందన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ ఎందుకు సాధ్యం కాదని రాంవిలాస్ పాశ్వాన్ తన నియోజకవర్గం హాజీపూర్ కి రైల్వే జోన్ ఎలా ప్రకటించుకున్నారని నాగేశ్వర్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ కి నిధుల కొరత లేకుండా ఉండేందుకు వెయ్యికోట్లతో రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేస్తే పనులు వేగవంతం అవుతాయని సూచించారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందని వాటిపై విడిగా మరోసమావేశం నిర్వహించాలన్నారు.

