వైసీపీ సెల్ఫ్‌గోల్... జనసేనదే అప్పర్ హ్యాండ్...!

ఆచితూచి అడుగులు వేయకపోతే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వైసీపీ నేతలకు తెలుస్తోంది! తమ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏ చిన్న సందర్భం దొరుకుతుందా అని వేచిచూస్తున్నారు. అయితే జనసేన స్థలం వివాదంలో తలదూర్చి.. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక తంటాలు పడుతున్నారు వైసీపీ నేతలు! తొందరపాటుతో ఇలాంటి దుమారంలో ఇరుక్కున్న వైసీపీ.. సెల్ఫ్ గోల్లో పడిపోయింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన గౌతంరెడ్డి.. వైసీపీని ఇరకాటంలో పడేశారు.
గౌతం రెడ్డి ఇరికించారా?
జనసేన స్థలం వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇందులో రాజకీయ కుట్ర ఉందని పవన్ అనుమానించడంతో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది. పవన్ ఏపీ జనసేన ఆఫీస్ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద పార్టీ కార్యాలయం కోసం జనసేన దాదాపు మూడు ఎకరాల భూమి రైతు యార్లగడ్డ వెంకటేశ్వరరావు వద్ద నుంచి లీజు కి తీసుకోవడం,, ఆ భూమి తమదంటూ మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన కొందరు తెరపైకి రావడం, భూమి వివాదాస్పదమైనదని తేలితే, లీజు అగ్రిమెంట్‌ని రద్దు చేసుకుంటామని జనసేన అధినేత పవన్ ఈ వివాదంపై స్పందించడం తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడి అండతో ఇది జరగడం అనుమానాలకి తావిస్తోందని పవన్ ప్రస్తావించడం గమనార్హం.
రాజకీయ కుట్రేనా?
ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందని నెటిజన్లు, సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆరోపణలు చేసిన ముస్లిం వ్యక్తులు టీవీ డిబేట్ లో చిన్న చిన్న ప్రశ్నలకే తెల్ల మొఖం వేయడంతో పాటు, భూమి యజమాని యార్లగడ్డ వచ్చి సర్వే నంబర్లతో సహా వివరాలు వెల్లడించడంతో ఇది రాజకీయ కుట్రేనన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు అందరి దృష్టి, పవన్ ప్రస్తావించిన ఆ రాజకీయ నాయకుడు ఎవరు, ఏ పార్టీ కి చెందిన వారు అనే విషయంపై పడింది. ముస్లిం కుటుంబంతో పాటు గౌతం రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో పాల్గొనడంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ ఇష్యూ లో ఎంటరయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారికంగానే గౌతం కొనసాగుతున్నారా?
ముస్లిం కుటుంబం కూడా జనసేన మూడేళ్ల లీజుకి తీసుకున్న స్థలానికి సంబంధించిన పత్రాలు మంత్రి కే ఈ కృష్ణ మూర్తి సహాయంతో తారుమారయ్యాయనే వాదన వినిపిస్తోంది. కేవలం మూడేళ్ల లీజుకి తీసుకునే స్థలం కోసం అంత దుస్సాహసం ఎవరూ చేయరని, టీడీపీ మంత్రిని ఇరికించే ప్రయత్నం చూస్తూంటే వీరి వెనుక వైసీపీ ఉన్నట్టు సామా న్యులకు కూడా అర్థమవుతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గౌతంరెడ్డి ఆ మధ్య వంగవీటి రంగా పై అనుచిత వ్యాఖ్యలు చేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన అనధికారంగా వైసీపీ నేతగానే కొనసాగుతున్నారు. ఇప్పుడు అనవసరంగా జనసేన స్థల వివాదం ఇష్యూలోకి ఎంటర్ అయ్యి మరోసారి పార్టీకి ఇబ్బందిగా మారారు.

