వైసీపీ, జనసేన రావాల్సిందే : చంద్రబాబు

మరోసారి అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఆ సమావేశానికి రావాల్సిందేనన్నారు. మంత్రులు వెళ్లి వారిని స్వయంగా ఆహ్వానిస్తారని చెప్పారు. అప్పటికీ రాకుంటే ప్రజలకే ఆ మూడు పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. ఏపీ అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశం వివరాలను వెల్లడించారు. కేంద్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసి అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రధాని మోడీ అమరావతి, తిరుపతిలో ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్ లను ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రదర్శించారు. ప్రధాని మోడీ హామీని తాను విశ్వసించానన్నారు. ప్రధాని హోదాలో మాట ఇస్తే తాను నమ్మకుండా ఎలా ఉంటానన్నారు. ఏపీకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలో కెల్లా అత్యున్నతమైన రాజధానిని నిర్మిస్తామని చెప్పిన మోడీ ఎందుకు మాట తప్పాల్సివచ్చిందన్నారు. ఏపీ విభజన హామీలు అమలు చేయాలని కోరడం తప్పా అని నిలదీశారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి రాష్ట్రం కోసం పోరాడాల్సిందేనన్నారు.
