వైసీపీ ఎమ్మెల్యేకు లక్కీ ఛాన్స్

చంద్రబాబు పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తున్నట్లు మరోసారి రుజువైంది. వైసీపీ నుంచి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో నలుగురికి మంత్రి పదవులు దక్కగా, మరొకరికి కార్పొరేషన్ పదవి దక్కింది. తాజాగా శాసనసభలో విప్ గా వైసీపీ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమ పార్టీ నుంచి జంప్ చేసి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే తాము అసెంబ్లీకి వస్తామని వైసీపీ చెప్పినా... పుండు మీద కారం చల్లినట్లు మరో వైసీపీ నేతకు శాసనసభలో కీలక పదవిని అప్పగించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును శాసనసభలో విప్ గా చంద్రబాబు ప్రకటించారు. దీంతో వైసీపీ నుంచి జంప్ చేసి వచ్చినందుకు ఆయనకు చంద్రబాబు నజరానా ప్రకటించినట్లయింది.
కిడారిపై తొలి నుంచి అనుమానమే....
వైసీపీ నుంచి అరకు ఎమ్మెల్యేగా నెగ్గిన కిడారి సర్వేశ్వరరావు 2014లో గెలిచారు. ఆయన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కు అనుంగు శిష్యుడు. దీంతో ఆయన పార్టీ మారతారని తొలినుంచి వైసీపీ నేతలు ఊహించారు. తనను పార్టీ పెద్దలు పక్కన పెడుతున్నారని పార్టీని వీడి వెళ్లే ముందు సర్వేశ్వరరావు అనేక ప్రకటనలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ వాస్తవంగానే కిడారిని పక్కన పెట్టింది. కిడారి పై భూకబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. పాడేరు మెయిన్ రోడ్డు లోని అంబేద్కర్ సెంటర్లో రోడ్డుపక్కన ఉన్న ఆరు సెంట్ల ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే ఆక్రమించారని ఆ స్థలం వారసులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఎమ్మెల్యే మొత్తానికి అధికార పార్టీలో చేరారు. గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనే ఆయన మంత్రి పదవిని ఆశించారు. కాని చంద్రబాబు అప్పటికే వైసీపీ నుంచి వచ్చిన నలుగురికి ఇవ్వడంతో కిడారిని పక్కన పెట్టారు. తాజాగా కిడారికి విప్ పదవి ఇచ్చి ఆయనను చంద్రబాబు సంతృప్తి పర్చారు. వైసీపీ నేతలపై గెలిచి అధికార పార్టీలో చేరి ఇప్పుడు విప్ గా కిడారి వ్యవహరించాలన్న మాట.
- Tags
- వైసీపీ ఎమ్మెల్యే

