వైసీపీ ఈ టిక్కెట్ ఆమెకే గ్యారంటీనా?

వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లా శింగనమలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి ఆయన శింగనమల నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. అయితే శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతిని జగన్ హైలెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శింగనమల టిక్కెట్ జొన్నలగడ్డ పద్మావతికే దక్కుతుందన్న టాక్ బలంగా విన్పిస్తోంది. శింగనమల నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే యామిని బాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరుపున పోటీ చేసి కేవలం 4,584 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి జొన్నలగడ్డ పద్మావతి పట్టువీడకుండా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా పోటీ ఉండటంతో టిక్కెట్ మళ్లీ వస్తుందా? రాదా? అన్న అనుమానం జొన్నలగడ్డ పద్మావతి వర్గంలోనూ ఉంది.
పద్మావతికే చాన్స్.....
అయితే ఈ విషయాన్ని పటాపంచలు చేస్తూ జగన్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి ఎవరనేది స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ జొన్నలగడ్డ పద్మావతికే మళ్లీ టిక్కెట్ దక్కుతుందని ఆమె అనుచరులు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్ మూడు రోజుల నుంచి ప్రతి సమావేశంలోనూ పద్మావతికి చోటు కల్పిస్తున్నారు. తన పక్కనే నిల్చునే అవకాశం కల్పించారు. సమావేశంలో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. దీంతో తిరిగి జొన్నలగడ్డకే ఈసారి కూడా టిక్కెట్ దక్కుతుందన్న వ్యాఖ్యలు ఆమె వర్గంలో విన్పిస్తున్నాయి. జగన్ ఈరోజు పాదయాత్రలో భాగంగా గార్లదిన్నెలో బీసీ సదస్సు పెట్టారు. బీసీలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి కులాన్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర కూడా చేశారు.
- Tags
- వైసీపీ

