వైసీపీలో ఎందుకీ గందరగోళం?

ఆంధ్రప్రదేశ్ వైసీపీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పాదయాత్ర వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. ‘కష్టపడతాం... జెండాను మోస్తాం.... అధినేతకు అండగా ఉంటాం...’ కాని టిక్కెట్ మాటేమిటన్నది ఫ్యాన్ గుర్తు నేతల ప్రశ్న. జగన్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. వారి ముందు కొన్ని కార్యక్రమాలను ఉంచారు. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేక హోదా కోరుతూ యువభేరిలను నిర్వహించాలని, స్థానిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని ఆదేశించారు. అయితే వీరందరూ కార్యక్రమాలకు చేయడం సిద్ధమే. కాని ఇంత కష్టపడ్డా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దొరుకుంతా? లేదా? అన్నదే డౌట్. ఎందుకంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే బి ఫారం చేతికొచ్చేదాకా నమ్మకం లేదు. అందుకే వీరిలో కొందరు ఏకంగా పార్టీ సీనియర్ నేతల ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట.
టిక్కెట్లపై హామీ కావాలంటున్న......
గత నాలుగేళ్లుగా జగన్ ప్రతిపక్ష నేతగా అనేక సమస్యలపై ఉద్యమించారు. ప్రతి జిల్లాలో పర్యటించారు. ప్రతి సమస్యమీద స్పందించారు. అక్కడికి వెళ్లి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. సిక్కోలు నుంచి చిత్తూరు దాకా.... కడప నుంచి అనంతపురం వరకూ అన్ని జిల్లాలను చుట్టి వచ్చేశారు. ఈ కార్యక్రమాలను పార్టీ ఇన్ ఛార్జులే దగ్గరుండిచూసుకున్నారు. కాని ఇటీవల ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఇన్ ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ టిక్కెట్ వద్దన్నప్పటికీ జగన్ మౌనాన్నే పాటించారు. అలాగే బుట్టా రేణుక తనకు ఎంపీ టిక్కెట్ పై హామీ ఇవ్వాలని కోరినా ఇవ్వడానికి నిరాకరించారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటన్నది వైసీపీ నేతలను పట్టిపీడిస్తున్న సమస్య. జగన్ పాదయాత్ర సందర్భంగా పిలుపు నిచ్చిన కార్యక్రమాలు చేపట్టాలంటే ఖర్చుతో కూడుకున్నది. ఖర్చు పెట్టుకున్నా చివరకు టిక్కెట్ వస్తున్న గ్యారంటీ లేదు. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ టీం సర్వే కూడా వీరిని భయపెడుతోంది. ప్రజల మధ్యలో తిరుగుతున్న వారికే టిక్కెట్లు దక్కుతాయని అధినేత నేరుగా చెప్పేశారు. మరొకవైపు నియోజకవర్గంలో గెలుపు గుర్రాలెవరనేది పీకే టీం ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది. మొత్తం మీద నియోజకవర్గ ఇన్ ఛార్జులకు, ఎమ్మెల్యేలకు జగన్ నుంచి టిక్కెట్ హామీ కావాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. మొత్తం మీద వైసీపీ నేతల్లో కొంత అనుమానాలైతే ఉన్నాయి. వీటిని అధినేత తొలగించకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
- Tags
- వైసీపీ

