వైసీపీకి బిగ్ షాక్....!

కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు కంచుకోట. టీడీపీకి పెట్టని కోట!! అలాంటి దగ్గర ఆయనపై పోటీచేయాలంటే ఎవరైనా ఆలోచించాల్సిందే! అలాంటి చోట వైసీపీ అభ్యర్థి ఓడిపోయినా 57వేల ఓట్లు సాధించగలిగారంటే.. దాని వెనుక కార్యకర్తలు, బలమైన నాయకులు కచ్చితంగా ఉంటారు. అలాంటి వారిలో జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఒకరు. దివంగత వైఎస్ వెన్నంటే నడిచి.. తర్వాత జగన్కు బాసటగా నిలిచిన ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకుని.. పార్టీ నేతలను అయోమయంలో పాడేశారు. వరుసగా అవమానాలు ఎదురవుతున్నా.. తనకు టికెట్ దక్కకపోయినా అన్నింటినీ దిగమింగి అహర్నిశలు పనిచేసిన ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చంద్రబాబు ఇలాకాలో ఇప్పటివరకూ అంతోఇంతో బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయింది.
జగన్ చిత్తూరు చేరుకునే లోగానే....
ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న తరుణంలో వైసీపీ క్యాడర్లో జోష్ నింపాలని, అధికారంలోకి తీసుకురావాలని ఆపార్టీ అధినేత ఒకపక్క ప్రజాసంకల్ప యాత్రలో బిజీబిజీగా ఉంటే.. మరోపక్క కీలక నేతలంతా పార్టీని వీడుతుండటం నాయకులను సందిగ్ధంలో పడేస్తోంది. ఇప్పటికే అంతోఇంతో ఆందోళనలో ఉన్న వీరు మరింత గందరగోళానికి గురవు తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో జరుగుతున్న పరిణామాలు.. జగన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి! ఆ పార్టీలో కీలకనేత, జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
కంటతడి పెట్టిన సుబ్రమణ్యం....
కుప్పంలో ఆదివారం అనుచరులతో సమావేశమైన సుబ్రమణ్యంరెడ్డి తాను వైసీపీకి రాజీమా చేస్తున్నట్లు ప్రకటించ డమే గాక.. పార్టీ అధ్యక్షుడు జగన్కు రెండు పేజీల లేఖ కూడా రాశారు. అందులో తన ఆవేదనంతా వెళ్లగక్కారు. పార్టీతో ఇన్నాళ్లు కొనసాగిన అనుబంధాన్ని తెగదెంచుకునే సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనై కంట తడి పెట్టారు. వైఎస్ హయాంలో చిన్నాచితకా పదవులనుంచి జడ్పీ ఛైర్మన్ పదవికి ఆయన ఎదిగారు. ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వైఎస్ మరణానంతరం సుబ్రహ్మణ్యం రెడ్డి.. జగన్ వెంటనే నడిచారు. 2014 ఎన్నికల్లో తనకు ఇస్తానని ఆశపెట్టి, తర్వాత బీసీ అయిన చంద్రమౌళికి ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చారు. కొంత నిరాశకు గురయినా.. నేతలు బుజ్జగించ డంతో తేరుకున్న ఆయన.. పార్టీకోసం పనిచేశారు. దీనివల్ల పార్టీ అభ్యర్థికి 57 వేల ఓట్లు పోలయ్యయి.
పెద్దిరెడ్డి జోక్యంతోనే....
పార్టీలో తనకు రక్షణ కవచంగా నిలిచి కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే నడుస్తాయని నాడు పార్టీలోని పెద్దలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎన్నడూ తనకు విభేదాలు లేకున్నా, ఆయన తనను కుప్పం నియోజకవర్గంలో ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపించారు. 2019 ఎన్నికల దాకా నియోజకవర్గంలో అడుగు పెట్టరాదంటూ తనకు ఆంక్షలు విధించడం పొమ్మనలేక పొగపెట్టడమేనని వాపోయారు. అవమానాలు భరించే శక్తిలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. అయితే ఎన్నికలు ఇంకో ఏడాదిన్నరలో ఉండాయనగా వైసీపీనుంచి నిష్క్రమించడం కుప్పంలో ఆ పార్టీకి కూడా కష్టమనేనే చర్చ మొదలైంది. సుబ్రమణ్యంరెడ్డి పక్కా స్థానికుడు కావడం వైసీపీకి బాగా కలిసొచ్చింది. ఇన్నాళ్లూ ఆయన అండతో కుప్పంలో వైసీపీ బలంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా పార్టీకి తీరని లోటుగానే మిగిలిపోతుందనేది విశ్లేషకుల అంచనా.
- Tags
- వైసీపీ

