వైసీపీకి నష్టం జరిగినా.... సీనియర్ నేతల కోసం జగన్....?

కర్నూలు జిల్లాలో నేతలు టీడీపీ బాట పట్టడాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. ఇందుకోసం టీడీపీలోకి నేతలు వెళ్లినా మరికొందరి నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను డైవర్ట్ చేయడానికి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు రేణుకతో కలిపి ముగ్గురు ఎంపీలు పార్టీని వీడి వెళ్లిపోయారు. దీంతో మాజీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపికి ధీటుగా లీడర్లను పెద్దయెత్తున్న పార్టీలోకి చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలు ఈపని మీదే ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలైన కోట్ల సూర్యప్రకాశరెడ్డితో పాటు కడప జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రరెడ్డితో కూడా వైసీపీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ సీనియర్ నేతలే. నియోజకవర్గాల్లో పట్టున్న లీడర్లే. వీరికోసం వైసీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలను ఇప్పటికే జగన్ ఆ జిల్లాలకు పంపినట్లు తెలిసింది.
కోట్ల.. డీఎల్ కోసం.....
ముఖ్యంగా బుట్టా రేణుక పార్టీని వీడితే ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు కోట్ల సూర్యప్రకాశ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. కోట్ల సూర్యప్రకాశరెడ్డి కుటుంబం టీడీపీలో చేరతారన్న ప్రచారం ఇటీవల కాలంలో బాగా జరిగింది. తన బంధువుల ఇంట్లో వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబును కోట్ల కలిసినా దానికి పాలిటిక్స్ ను రంగరించారు. ఇటీవల నంద్యాల పర్యటనకు వచ్చిన చంద్రబాబు కోట్ల ఇంటికి కూడా వెళ్లాలనుకున్నారు. కాని కోట్ల మాత్రం తాను టీడీపీలోకి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లలేదు. కోట్ల నో చెప్పడం వల్లనే రేణుకకు ఎస్ చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని వీలయినంత త్వరగా పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత ప్రయత్నిస్తున్నారు. ఇక కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గానికిచెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కూడా పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎల్ కూడా టీడీపీలోకి వెళ్దామనుకున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో తనకు ఇన్ ఛార్జి పదవి ఇస్తేనే పార్టీలోకి వస్తానని డీఎల్ షరతుకూడా పెట్టారు. అయితే గత ఎన్నికల్లోపోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ససేమిరా అంటున్నారు. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చినా... వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో డైలమాలో ఉన్న డీఎల్ ను కూడా వైసీపీలోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం వైఎస్ జగన్ బాబాయి వివేకానందరెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద నష్టం జరిగినా కుంగిపోకుండా సీనియర్ నేతలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. మరి జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయో... లేదో.
- Tags
- జగన్

