వేంకటనాధుని బ్రహ్మూెత్సవ వైభవం నేటినుంచే!

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరు వేంకట గిరినాధుడు కొలువుదీరిన సప్తగిరులలో... వార్షిక బ్రహ్మూెత్సవ వేడుక ఆదివారం నాడు ప్రారంభం కానుంది. ఆర్తత్రాణ పరాయణుడైన జగద్రక్షకుడు శ్రీనివాసుని సేవలో సాక్షాత్తూ బ్రహ్మ వచ్చి నిర్వహించే ఉత్సవాలుగా ఈ బ్రహ్మూెత్సవాలకు ఖ్యాతి ఉంది. అక్టోబరు 2వ తేదీనుంచి 11వ తేదీ వరకు భక్తకోటి కనులపండువగా.. తిరుమల గిరులలో అత్యంత శోభాయమానంగా, భక్తి తాదాత్మ్య పురస్సరంగా, ఆధ్యాత్మ విశిష్ట ఉత్సవంగా బ్రహ్మూెత్సవాలు జరగనున్నాయి.
అక్టోబరు 2వ తేదీన ఉత్సవాలకు అంకురారోపణ జరుగుతుంది. 3వ తేదీ ధ్వజారోహణం తరువాత పెద్దశేష వాహనం ఉంటుంది. 4వ తేదీ చిన్న శేష వాహనం, హంస వాహనం ఉంటాయి. 5వ తేదీ సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం ఉంటాయి. 6వ తేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనసేవలు జరుగుతాయి. 7 వతేదీన పల్లకీ ఉత్సవం, గరుడసేవ ఉంటాయి. 8న హనుమంత వాహన సేవ, స్వర్ణ రథోత్సవం, గజవాహనసేవ జరుగుతాయి. 9 వతేదీన సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు ఊరేగుతారు. 10వ తేదీన రథోత్సవం, అశ్వవాహనసేవ జరుగుతాయి. 11వ తేదీన పల్లకీ ఉత్సవం, చక్రస్నానం, ధ్వజాహణం జరుగుతాయి.
అంకురారోపణకు ముందునాడు.. తిరుమల నాధుని సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ.. దశదిశలా బ్రహ్మూెత్సవాలకు సంబంధించిన ఆహ్వానాలను దేవతలకు పంపుతారు. నాలుగు మాడ వీధుల్లో విష్వక్సేనుల వారు ఊరేగుతూ బ్రహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించడం, దేవతలకు, సప్తగిరులలో అదృశ్యరూపంలో ఉండే ఋషులు, మునులకు అందరినీ ఆహ్వానిస్తారనేది ప్రతీతి. ఇదే రోజున అంకురారోపణ అనగా.. నవ ధాన్యాలను ఆలయ ప్రాంగణంలో నారులాగా పోస్తారు. అవి మొలకెత్తుతాయి. అలా మొలకలు వచ్చేలాగా బీజాలను వేయడాన్నే 'అంకుర-ఆరోపణ' ... అంకురార్పణ గా వ్యవహరిస్తారు. ఈ క్రతువుతో బ్రహ్మూెత్సవ వైభవం ప్రారంభం అయినట్టే.
పదిరోజుల పాటూ అత్యంత అద్భుతమనదగిన రీతిలో జరిగే ఈ ఉత్సవాలలో 7వ తేదీన జరిగే గరుడసేవ అత్యంత ప్రశస్తమైనది. శ్రీహరి మూల విరాట్టుకు అలంకరించే సర్వాభరణాలను ఆనాడు ఉత్సవమూర్తి అయిన మలయప్పకు అలంకరించి.. గరుడునిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. గరుడారూఢుడైన శ్రీహరిని దర్శించడమే సకల పాపనాశకమైన అదృష్టంగా భక్తకోటి ప్రణమిల్లుతుంది.
అనునిత్యం 'నమో వేంకటేశాయ' అనే నామ స్మరణలు, 'గోవిందా గోవింద' అనే భక్తి పారవశ్యపు నినాదాలతో ప్రతిధ్వనిస్తూ ఉండే సప్తగిరులు రాబోయే పదిరోజుల పాటూ మరింతగా ఆధ్యాత్మిక వైభవాన్ని పరిపుష్టం చేయనున్నాయి.

