వీళ్లవి ఉత్తుత్తి బెదిరింపులేనా...?

నాగాలాండ్ ఎన్నికల్లో పెద్ద టెన్షన్ తీరిపోయింది. నామినేషన్లకు ఆఖరి గడువు వరకూ ఎవరూ నామినేషన్లు సమర్పించకపోవడంతో అసలు ఎన్నికలు జరగుతాయా? లేదా? అన్న సందేహం తలెత్తింది. నాగా ఒప్పందం బయటపెట్టాలని, గ్రేటర్ నాగాలాండ్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ నాగాలాండ్ లో దాదాపు అన్ని పార్టీలూ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. దీంతో అధినాయకత్వం జోక్యంతో బీజేపీ, కాంగ్రెస్ లు తాము ఎన్నికలను బహిష్కరించడం లేదని తెలిపాయి.
చివరి రోజు నామినేషన్లు....
ఈనెల 7వ తేదీతో నామినేషన్లకు చివరి గడువు. అయితే ఆరోతేదీ వరకూ ఒక్క నామినేషన్ పడలేదు. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ లో ఒక్క నామినేషన్ కూడా మంగళవారం వరకూ పడకపోవడంతో అధికారులు కూడా ఆందోళన చెందారు. నాగా ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ బలంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో నాగాలాండ్ లో ఎన్నికల నిర్వహణ కష్టమేనని అందరూ భావించారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు....
అయితే నామినేషన్ల ప్రక్రియ చివరిరోజైన బుధవారం నామినేషన్లు విపరీతంగా వచ్చాయి. చివరి రోజు 253 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 27వ తేదీన నాగాలాండ్ ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజు వచ్చిన నామినేషన్లు చూసి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తొలి నామినేషన్ అధికార పార్టీ నాగా పీపుల్స్ ఫ్రంట్ వేయడం గమనార్హం. ముఖ్యమంత్రి జెలియాంగ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. తిరుగుబాటు గ్రూపులతో చర్చలు జరిపిన తర్వాతనే నేతలు నామినేషన్లు వేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద నాగాలాండ్ లో అధికారులకు ఒక ప్రధాన సమస్య తీరినట్లయింది. ప్రధాన పార్టీలు మాత్రం ఎన్నికల బహిష్కరణ అటూ ఉత్తుత్తి పిలునిచ్చారన్నది స్పష్టమయింది.
- Tags
- నాగాలాండ్

