వీరి గొడవకు రాజకీయం కారణం కాదట...!

ఆదివాసులు, లంబాడీల మధ్య గొడవ ముదరడానికి కారణం రాజకీయం కాదా? కేవలం ప్రభుత్వ పొరపాటు వల్లనే ఈ రగడ జరిగిందా? అవుననే అంటున్నారు. ఇటీవల తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, లంబాడీల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలూ బాహాబాహీకి దిగి పలు షాపులను, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది. దీంతో అక్కడి పోలీసు అధికారపై కూడా ప్రభుత్వం బదిలీవేటు వేసింది. శాంతి భద్రతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలయమ్యారు. ఇంతకూ వీరి మధ్య రగడ జరగడానికి కారణాలేంటి?
నిఘా నివేదిక ప్రకారం...
ఆదివాసీలకు, లంబాడీలకు అనేక వరాలు ప్రకటించినా రెండు వర్గాల మధ్య ఎందుకు ఘర్షణ తలెత్తిందన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఇంటలిజెన్స్ నివేదికను తెప్పించుకున్నారు. గొడవ వెనుక రాజకీయ జోక్యం ఉంటుందన్న అనుమానం తొలుత వ్యక్తమయింది. అయితే దీనికి ప్రధాన కారణం జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలే కారణమని తేలింది. అందుకోసం దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం దిగింది. చీఫ్ సెక్రటరీ ఎస్సీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి వెళ్లి రెండు వర్గాలతో చర్చలు జరిపారు. సమస్యలను విన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాలోనే...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ రగడ తొలుత ప్రారంభమైంది. అక్కడ ఆదివాసులు, కోయలు, గోండ్లు, చెంచులు ఎక్కువగా నివసిస్తున్నారు. వీరిని ప్రభుత్వం 1974లోనే అటవీ ప్రాంతంలో నివసించే వారందరినీ ఆదివాసీలుగా గుర్తించింది. వీరికి పోడు భూములను కేటాయించింది. వారిపేరు మీదనే భూములను రిజిస్టర్ చేసింది. అయితే లంబాడీలు మాత్రం అటవీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. వీరుచిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరు కొంత ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
నష్టనివారణ చర్యలు ప్రారంభం...
అయితే తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అప్పటి వరకూ ఉన్న భూదలాయింపు చట్టంలో సవరణలు చేశారు ఉన్నతాధికారులు. దీంతో లంబాడీలు ఆదివాసీల భూములను కొనుగోలు చేస్తూ వస్తున్నారు. తమ భూములను లంబాడీలు కొనుగోలు చేస్తూ వారిపేర్లమీద రిజిస్టర్ చేయించుకోవడంతో ఆదివాసీల్లో ఆందోళన ప్రారంభమైంది. ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆదివాసీలు ఆందోళన బాట పట్టారని సీఎం కేసీఆర్ కు వచ్చిన ఇంటలిజెన్స్ నివేదికలో వెల్లడయింది. అంతేకాకుండా రిజర్వేషన్ల శాతం కూడా పెరిగితే తమ ఉద్యోగాలను లంబాడీలే ఎక్కువ తీసుకెళ్లిపోతారన్న ఆందోళన కూడా వారిలో మొదలయింది. ఇది తెలుసుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలను ప్రారంభించింది.

