వీరిద్దరూ ఒకటైపోయినట్లేనా?

కమలనాధులకు చెక్ పెట్టేందుకు వారిద్దరూ ఒక్కటవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఉప్పు, నిప్పూలా ఉండే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాలని ఒక నిర్ణయానికి వచ్చాయన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయజెండాను పాతేసిన కమలనాధులు తమకు ఎక్కడా ఎదురులేదంటున్నారు. తమ తర్వాత లక్ష్యం పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిషా అని చెబుతున్నారు. ఆ మూడింటిని ఓడించి దేశం మొత్తాన్ని కాషాయమయం చేయాలని కలలు కంటున్నారు.
కాషాయ పార్టీకి బ్రేకులు వేసేందుకు....
అయితే కాషాయ పార్టీ విజయాలకు బ్రేకులు వేయడానికి ఉత్తరప్రదేశ్ లో బీజం పడిందంటున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయవతి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇద్దరూ ఒక్కటవుతారన్న ఊహాగానాలు పెద్దయెత్తున విన్పిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామాలు చేయడంతో ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
త్వరలోనే ప్రకటన....
పోలింగ్ కు కొద్దిరోజుల ముందే వీరిద్దరూ ఒకటవుతారని, బీఎస్పీ అధినేత్రి మాయావతి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తారని తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తరుపున గోరఖ్ పూర్త నుచి ప్రవీణ్ కుమార్ నిషాద్, ఫూల్ పూర్ నుంచి నాగేంద్రసింగ్ లు బరిలో ఉన్నారు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న మాయావతి ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారని తెలుస్తోంది. తన పార్టీ నేతలతో కూడా ఈవిషయాన్ని మాయావతి చర్చించినట్లు చెబుతున్నారు. పోలింగ్ కు ముందే మాయావతి నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇద్దరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టవచ్చన్న ఉద్దేశంతో మాయావతి మెట్టు దిగి ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. దీనిపై మాయావతి ప్రకటన రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఇదే జరిగితే 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.
.

