వీరిద్దరికీ అక్కడ ‘‘సీన్’’ లేదట...!

గోమాంసమే ఇక్కడ బీజేపీని దెబ్బతీస్తుందా? గోమాంసంపై నిషేధం విధించడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీకి కష్టాలు ఎదురవుతున్నాయి. తర్వాత ఆ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్నా ఫలితం లేకుండా పోయింది. మేఘాలయ రాష్ట్రానికి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఖాసీలు, గారోలు, జయింటియాలు అత్యధికంగా ఉండే ఈ రాష్ట్రంలో బీజేపీకి గోమాంస నిషేధం పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో నోటిఫికేషన్ ను రద్దు చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచేందుకు గోమాంసం తో సహపంక్తి భోజనాలను బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాటు చేస్తున్నా పెద్దగా ఫలితమివ్వడం లేదంటున్నారు. ముఖ్యంగా బీజేపీని ఇక్కడి ఆదివాసీలు నమ్మడం లేదు. తమ సంస్కృతిని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అనుమానిస్తున్నారు.
ఎన్పీపీకే అవకాశాలు...
దీంతో అక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ కొంత పుంజుకునే పరిస్థితి కన్పించింది. మాజీ లోక్ సభ స్పీకర్ పీఎ సంగ్మా ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం ఆ పార్టీని ఆయన కుమారుడు సి. సంగ్మా నాయకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి బీజేపీతో అనుబంధం కలిగిన నేషనల్ పీపుల్స్ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుంది. అదే దానికి లాభం చేకూరుస్తుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే నేషనల్ పీపుల్స్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఐదుగురు శాసనసభ్యులు ఈ పార్టీలో ఇటీవల చేరడం సంగతి తెలిసిందే. బీజేపీతో కలిసి వెళితే ఓటమి ఖాయమని భావించిన నేషనల్ పీపుల్స్ పార్టీ ఒంటరిగానే దిగడంతో వలసలు ఎక్కువయ్యాయన్నది విశ్లేషకుల అంచనా.
బీజేపీ, కాంగ్రెస్ లపై వ్యతిరేకత....
ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ కష్టకాలమేనంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. అధికారంలో ఉండటంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అందుకే అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు అసంతృప్తిని పసిగట్టి బయటకు వెళ్లిపోయారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీకి కూడా అంత సీన్ ఇక్కడ లేదని చెబుతున్నారు. అస్సోం మాదిరిగా ఇక్కడ బీజేపీకి పరిస్థితులు ఉండవంటున్నారు.ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ అంతిమంగాలోకల్ పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీకే ఎక్కువ అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. సర్వేలు కూడా అదే విషయాన్ని వెల్లడించాయంటున్నారు.
- Tags
- మేఘాలయ

