వీరంతే...మారరు గాక...మారరు...!

ప్రధాని మోడీ వచ్చిన జోష్ బీజేపీ నేతల్లో ఎంత సమయమో లేదు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు, శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డికి మధ్య అసలు పడటం లేదు. పైకి నవ్వుతూ పలకరించుకుంటున్నా లోలోపల మాత్రం ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. నేతల మధ్య సమన్వయం ఉండాలని ఎంత చెబుతున్నా వీరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రధాని పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు లభించిన ప్రాధాన్యతను చూసి కిషన్ రెడ్డి కొంత అక్కసుకు గురయ్యారు. ప్రధాని తన వెంటనే లక్ష్మణ్ ను తిప్పుకోవడం ఆయనకు అస్సలు నచ్చడం లేదు. తనను కూడా తీసుకెళ్లినప్పటికీ మోడీ లక్ష్మణ్ కు ప్రాధాన్యత ఇచ్చారని కిషన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద బయటపడ్డారట.
వాహనం తెచ్చిన లొల్లి....
ఇదిలా ఉండగా తాజాగా మరో సంఘటన వీరిమధ్య మరింత గ్యాప్ పెంచింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం స్కార్పియో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. అయితే ఇది పాతది కావడంతో గత కొన్నాళ్లుగా లక్ష్మణ్ తన వాహనాన్ని మార్చాల్సిందిగా ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటున్నారు. మొత్తం మీద లక్ష్మణ్ కు పాత స్కార్పియో వాహనాన్ని తొలగించి కొత్తగా ఫార్చూనర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. ఇదే సమయంలో శాసనసభ పక్ష నేతగా కిషన్ రెడ్డి గత కొద్దిరోజులుగా తన పాత వాహనాన్ని మార్చాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదట. దీంతో లక్ష్మణ్ కు కొత్త వాహనం వచ్చిన రోజే కిషన్ రెడ్డి తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వానికి తిప్పి పంపేశారు. దీంతో ఆయనకు కొత్త వాహనం వచ్చిన వెంటనే ఈయన ప్రభుత్వానికి వాహనాన్ని పంపడం పార్టీలో చర్చకు దారితీసింది. మొత్తం మీద బీజేపీ నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలా ఉంటే తెలంగాణాలో బీజేపీ బలపడేది సాధ్యమేనా?
- Tags
- బీజేపీ

