విశాఖలో టెన్షన్...టెన్షన్
విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్కే బీచ్ లో ఏపీ యువత ప్రత్యేక హోదా కోసం నిరసనకు దిగుతామని ప్రకటించడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బీచ్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. మార్నింగ్ వాకర్స్ ను కూడా బీచ్ వైపు రానివ్వలేదు. బీచ్ అంతటా ఎక్కడకక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీ చేస్తున్నారు.
బుధవారం రాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను, వివిధ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏయూ నుంచి ఒక్కరినీ బయటకు రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అలాగే రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో తనిఖీలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై సోదాలు నిర్వహిస్తూ ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వస్తున్న ఆందోళనకారుల వాహనాలను నిలిపేశారు. దీంతో ఎప్పుడేంజరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది.
వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్నారు. జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. విశాఖ మొత్తం 144వ సెక్షన్ విధించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరసనలను అడ్డుకుంటే యుద్ధమే జరుగుతుందని ట్వీట్ చేశారు. ఈరోజు జరిగే నిరసనలను ఆపితే రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాల యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న అర్ధరాత్రి దేశ్ బచావో ఆల్బమ్ నుంచి మరో పాటను విడుదల చేశారు.